మొదటి సినిమాతో దెబ్బతిన్న అఖిల్ కి రెండో సినిమాతో అయినా మంచి హిట్ అందించాలని నాగార్జున కృత నిశ్చయంతో ఉన్నాడు. అందుకే రెండో సినిమా నిర్మాణ బాధ్యతలను నెత్తిన ఎత్తుకుని కావాల్సిన డైరెక్టర్ కి అఖిల్ ని అప్పజెప్పాడు. 'మనం' సినిమా వంటి హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ కి అఖిల్ 'హలో' బాధ్యతలు అప్పజెప్పాడు. ఇక నిర్మాతగా అన్ని దగ్గరుండి సినిమా బాధ్యతలను పర్యవేక్షిస్తూ.... ఏ ఒక్క విషయంలో కాంప్రమైజ్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న నాగార్జున ఇప్పుడు విక్రమ్ కుమార్ పై ఒత్తిడి పెంచుతున్నాడనే వార్తలొస్తున్నాయి. ఎందుకంటే అఖిల్ 'హలో' సినిమాని డిసెంబర్ 22 న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేశాడు. మరి సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోంది. అయితే 'హలో' సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తయినా కానీ ....ఇప్పటికీ కొంత కీలకమైన షూటింగ్ పార్ట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉంది. మరి విడుదల సమయం ఎంతో లేదు. అందుకే కంగారు పుట్టిన నాగ్... విక్రమ్ కి ఫోన్ చేసి తొందరగా వర్క్ కంప్లీట్ చెయ్యమని ఒత్తిడి పెంచుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
మరి 'మనం' వంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ని 'మనం' సినిమా షూటింగ్ టైం లో విక్రమ్ కుమార్ మీద నమ్మకముంచిన నాగ్, ఇప్పుడు మాత్రం కొడుకు సినిమా విషయంలో ఇలా ఒత్తిడి చెయ్యడం ఏమిటా అంటున్నారు కొందరు. అయితే నాగార్జున ఆలోచించేది 'హలో' సినిమా డిసెంబర్ లో విడుదల కాకపోతే మళ్ళీ సంక్రాంతికి విడుదల చెయ్యడానికి కుదరదు.. అప్పుడు పెద్ద సినిమాలు లైన్ లో ఉంటాయి. అందుకే నాగార్జున ఇప్పుడు ఇలా దర్శకుడు విక్రమ్ ని కంగారు పెట్టేసి డెడ్ లైన్ పెట్టేస్తున్నాడు.