రామ్ గోపాల్ వర్మ పేరు చెబితేనే ఇప్పుడు హీరోలంతా భయపడిపోతున్నారు. ఒకప్పుడు ఆయన దర్శకత్వంలో సినిమా చేస్తే బావుంటుంది అని అనుకున్న హీరోలే ఇప్పుడు ఆయనతో సినిమానా? అంటూనే.. అమ్మో అనేస్తున్నారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య తీసే సినిమాలు తలా తోక లేకుండా తీసే సినిమాలే. అసలు ఆయన నుండి సినిమా వస్తుంది అంటేనే అదేదో వల్గారిటీ ఉన్న సినిమానో.. లేకుంటే ఫ్యాక్షన్ అని చెబుతూ.... కొంతమంది ఫ్యాక్షనిష్టుల జీవిత చరిత్రలు తెరకెక్కించినా అందులో ఒక వర్గానికే ఫెవర్ గా సినిమా తీస్తాడులే అనే భావనలో కొట్టుకుపోతున్నారు జనాలు.
అలాంటి వర్మతో నాగార్జున ఇప్పుడు సినిమా చేస్తున్నాడట. నాగ్ కి వర్మ మీద ఎంతగా నమ్మకం లేకపోతే ఇప్పుడు ఈ టైం లో వర్మతో సినిమాకి కమిట్ అవుతాడు. ఏదైనా నాగార్జున ఈ నిర్ణయం మాత్రం షాకింగ్ నిర్ణయమే. అప్పుడెప్పుడో... తనకి శివ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడని ఆ తర్వాత 'అంతం, గోవిందా గోవిందా' చేశాడు. మళ్ళీ ఇన్నాళ్లకు ఇప్పుడు మరోసారి వర్మతో నాగార్జున సినిమా. మరి ఇప్పటికే వరుస ప్లాప్ లిస్తున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని తెరకెక్కించే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ సినిమా ఇలా ఎనౌన్స్ చేశాడో లేదో అలా గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ గొడవలు కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి బోలెడంత క్రేజ్ తెచ్చిపెట్టేశాయి.
మరి గత 20 సంవత్సరాలుగా వర్మకు అవకాశమే ఇవ్వని నాగార్జున ఇప్పుడు ఇలా ఉన్నట్టుండి రామ్ గోపాల్ వర్మకి అవకాశం ఇవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో తెలియదు గాని... నాగార్జున మాత్రం ఈ టైం లో రాంగ్ స్టెప్ వేస్తున్నాడా! అనే అనుమానంలో వున్నారు అక్కినేని అభిమానులు.