వ్యక్తిగత జీవితంలో ఎన్ని వివాదాలు ఉన్నా కూడా నటునిగా ధనుష్‌కి ఎవ్వరూ వంకపెట్టలేరు. విభిన్నమైన కాన్సెప్ట్‌లను ఒప్పుకుంటూ ఉంటాడు. కథ బాగా నచ్చితే లో బడ్జెట్ సినిమానైనా సరే తన రెమ్యూనరేషన్‌ని తగ్గించుకుని మరీ చేస్తుంటారు. ఇంకా బాగా నచ్చితే తానే నిర్మిస్తాడు కూడా. ఇక ఆయన రజనీకాంత్ అల్లుడి ముద్రలో పడకుండా తన కెరీర్‌ను బాగా డీల్ చేస్తున్నాడు. కాగా ఈయన కెరీర్‌లో మంచి హిట్టయిన 'విఐపి' (తెలుగులో 'రఘువరన్ బిటెక్') చిత్రాన్ని ఇటీవల రజనీ కూతురు సౌందర్య దర్శకత్వంలో చేశాడు. ఈ చిత్రంలో ఏకంగా బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కాజోల్‌ని తీసుకున్నాడు. ఎంతగా ప్రమోట్ చేసినా కూడా ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీలలో కూడా ఆడలేదు.
ఇక 2015లో ఆయన 'మారి' అనే చిత్రం చేసి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రానికి బాలాజీమోహన్ అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించాడు. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. ఇక ఈ చిత్రానికి ఇంతకాలానికి మంచి సీక్వెల్ కథ దొరికిందని ఆనందపడుతూ ధనుష్ ఈ చిత్రం సీక్వెల్‌కి ఓకే చెప్పేశాడు. ఇక ఈ చిత్రాన్ని ఆయన తన స్వంత బేనర్ అయిన వండర్‌బాల్ పతాకంపై తానే నిర్మించనున్నాడు. గ్యాంగ్‌స్టర్ కథతో రూపొందే ఈచిత్రం తెలుగులో ఆమద్య 'మాస్'గా వచ్చింది. ఇక ఈచిత్రం సీక్వెల్‌ను కూడా ఆయన తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించనున్నాడు.
ఇక 'ప్రేమమ్, ఫిదా' చిత్రాలతో దక్షిణాదిన ఓ ఊపు ఊపుతోన్న సాయిపల్లవి ఈ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పడం చూస్తే ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. మరి సాయిపల్లవికి తోడు 'మారి' హిట్‌ను ధనుష్ ఉపయోగించుకుని హిట్ కొడతాడా? లేదా విఐపి2 లా నిరాశపరుస్తాడా? అనేది వేచిచూడాల్సివుంది. ఇక ఈచిత్రంలో మలయాళంకే చెందిన టోవినో థామస్ నటిస్తున్నాడు. మరి ఈ 'మారి2' అయినా ధనుష్‌కి మంచి హిట్ ఇస్తుందని భావించవచ్చు. ప్రస్తుతం ప్రీపొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది.