వర్మ అంటేనే సిత్రంలో విసిత్రంగా చెప్పుకోవాలి. ఆయనది డిఫరెంట్ మైండ్‌సెట్. ఎవ్వరూ ఊహించనివి ఆయన ఊహిస్తుంటారు. ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని ఎంచుకోవడం, దానిని సోషల్‌మీడియా ద్వారా చర్చలోకి ఇంకా చెప్పాలంటే రచ్చ రచ్చలోకి దించడం, ఫైనల్‌గా ఓ ప్రీలుక్ పోస్టర్‌ని విడుదల చేసి వాద వివాదాలకు చోటివ్వడం ఆయనకు మామూలే. ఇక ఆయన నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత 'రాజు గారు పోయారు' అనే ఫస్ట్‌లుక్‌ని వదిలాడు. ఆ తర్వాత ఆ సినిమా ఏమైందో తెలియదు. ఇక 'సావిత్రి' అంటూ 'శ్రీదేవి' అంటూ కొన్ని చిత్రాల పేర్లను మారుస్తూ జనాలను పిచ్చోళ్లని చేసే లుక్స్‌ని, బాగా ఆకట్టుకుని వివాదం సృష్టించే పోస్టర్స్‌ని విడుదల చేశాడు. ఇక జయలలిత మరణం తర్వాత దేశం అంతా ఆమెపై చర్చ జరుగుతున్న సమయంలో 'శశికళ' ఆధారంగా 'అమ్మ' చిత్రం చేస్తానన్నాడు.
ఇక 'సర్కార్3' పూర్తయిన తర్వాత 'న్యూక్లియర్' పేరుతో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం చేస్తానని చెప్పాడు. అలాగని వర్మ చెప్పిన సినిమాలన్నీ చేయడని చెప్పడానికి లేదు. ఆయన తాను అనుకున్నట్లుగా మాఫియా నేపద్యంలో,రాజ్‌థాకరే, దావూద్ ఇబ్రహీం, అబూసలేం వంటి వారి జీవితాలను ఆదారంగా చేసుకుని మాఫియా బెదిరింపులకు కూడా బెదరలేదు. ముంబై అటాక్స్‌పై, వీరప్పన్‌తో పాటు స్వయంగా పరిటాల రవి, సూరి వంటి వారితో 'రక్తచరిత్ర'ను రెండు భాగాలుగా తీశాడు. అందులో ఏమాత్రం భయపడకుండా పరిటాల రవిని నాటి ముఖ్యమంత్రి అయినా ఎన్టీఆర్ గెటప్‌లో శత్రుఘ్నుసిన్హాని పెట్టి ఆయనను రౌడీయిజం, ఫ్యాక్షనిజం కన్నా రాజకీయంగా ఎదగమని పరిటాలను రాజకీయాలోకి తెచ్చే సీన్‌ని పెట్టాడు. ఎందరు వద్దు అన్నా 'వంగవీటి' చిత్రం తీసి విజయవాడ పరిసరాల్లోనే ఆడియో విడుదల చేశాడు.
ఇక ప్రస్తుతం ఆయన లక్ష్మీపార్వతి కోణంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మీద పడ్డాడు. ఈ చిత్రం కనుక తాను తీసి ఎన్టీఆర్ చివరిరోజులు, లక్ష్మిపార్వతి, చంద్రబాబు, బాలకృష్ణ అందరి పాత్రలను సినిమా చూపిస్తూ సినిమా తీశాడంటే మాత్రం ఆయన మరింత వివాదాస్పద వ్యక్తిగా దేశ వ్యాప్తంగా మరోసారి సంచలనంగా మారుతాడు. ఇక ఎన్టీఆర్ చివరి రోజుల్లో పరిణామాలను చూపిస్తే ఇక ఈ చిత్రం కమర్షియల్‌గా కూడా ఒక్కసారైనా వర్మ ఏమి చూపించాడో చూడాలని జనాలు చూస్తారు. ఇక ఆయన లక్ష్వీపార్వతిని పాజిటివ్‌గా చూపుతూనే ఈ చిత్రం తీయనున్నాడని స్పష్టమవుతోంది.
అయితే లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ని వివాహం చేసుకోకముందు ఆమె చరిత్ర ఏమిటి? అనే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ ఉండరాదని ఆల్‌రెడీ లక్ష్మీపార్వతి కండీషన్ పెట్టినట్లు, దానికి వర్మ కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇంట్లోకి అడుగుపెడుతున్న లక్ష్వీపార్వతి పాదాలను చూపించేలా పించేలా ఫస్ట్‌పోస్టర్‌ని రిలీజ్ చేశాడు. మరి ఇది పట్టాలెక్కుతుందా లేదా అనేది ఆయనను రెచ్చగొట్టే వారు, బెదిరించే వాళ్ల మీదనే ఆధారపడి ఉంది. ఎందుకంటే వర్మని రెచ్చగొట్టినా, భయపెట్టినా ఆయన ఖచ్చితంగా సినిమా తీసి చూపుతాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.