జై లవ కుశ జయోత్సవ వేడుకలో ఎన్టీఆర్ సినీ విశ్లేషకులను దారిన పోయే దానయ్యలతో పోల్చి కాంట్రవర్సీకి తెర లేపాడు. సినిమాను పేషేంట్ తో పోల్చి అందులోని నటీనటులు, టెక్నీషియన్స్ ని బంధువులుగా పోల్చడం... అలాగే ఇండస్ట్రీలోని కొంతమందిని మాత్రమే టార్గెట్ చేసి దారినపోయే దానయ్యలు అన్న విషయంపై మంగళవారం ఇండస్ట్రీలో వాడి వేడి చర్చ జరిగింది. సినిమా రివ్యూల మీద సినిమా విజయం ఆధారపడదని... ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా విజయం సాధిస్తుందని... అసలు సినిమా విడుదల తర్వాత మూడు రోజులకు రివ్యూ ఇస్తే బావుంటుందని... ఇలా చాలానే మాట్లాడి చాలామందికి టార్గెట్ అయ్యాడు ఎన్టీఆర్. మరి ఈ దసరా పండక్కి విడుదలవుతున్న సినిమాల్లో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ గత గురువారం విడుదయింది. సినిమాకి మిశ్రమ స్పందనతోపాటే మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయనే టాక్ ఉంది. మరి అలాంటప్పుడు ఎన్టీఆర్ ఇంతగా ఆవేశపడాల్సిన పనేముంది అంటున్నారు.
మరొకవైపు ఈ దసరాకి వస్తున్న మహేష్ నటించిన స్పైడర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ సినిమా రివ్యూలపై తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ మధ్యన సినిమా రివ్యూలు కాంట్రవర్సీ అవుతున్నాయని... నేనూ సినిమా రివ్యూలు చదువుతా... సినిమా బావుంది అంటే రివ్యూ రైటర్స్ బావుంది అని రాస్తారు... సినిమా బాగోలేదంటే బాగోలేదని రాస్తారు అంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. స్పైడర్ మూవీ విడుదల సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో మహేష్ ఇలా సినిమా రివ్యూలపై స్పందించాడు. మరి మహేష్ తన సినిమా స్పైడర్ విడుదలయ్యాక రివ్యూస్ రావాల్సి ఉంది. అందుకే ఇలా మట్లాడాడా.. లేకుంటే నిజంగానే సినీ విశ్లేషకులపై మహేష్ కి మంచి అభిప్రాయం ఉందా అనేది మాత్రం క్లారిటీ లేదు.
ఏది ఏమైనా ఎన్టీఆర్ సినీ విశ్లేషకులపై అలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తే మహేష్ మాత్రం కూల్ గా సినీ విశ్లేషకులు వాళ్ళ పని వాళ్ళు చేశారంటున్నాడు. చూద్దాం మహేష్ నటించిన స్పైడర్ సినిమాకి ఎలాంటి రివ్యూస్ వస్తాయో అనేది... మరికొన్నిగంటల్లో తెలిసిపోతుంది.