జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ పెద్దగా సినిమా అవార్డులను పట్టించుకునే వ్యక్తి కాదు. ఇతర అవార్డులను కూడా ఆయన పెద్దగా పరిగణనలోకి తీసుకోడు. కానీ తాజాగా ఆయనకు ఓ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. పవన్ చేస్తున్న సామాజిక సేవలను గుర్తించిన ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్స్‌లెన్స్ అవార్డు (ఐఈబిఎఫ్)కు పవన్‌ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.
నవంబర్ 17 బ్రిటన్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జరిగే సమావేశంలో పవన్‌కి ఈ అవార్డును అందజేశారు. పలు రంగాలలో విశేషమైన సేవలు చేసి లబ్దప్రతిష్టులైన వారికి ఈ సంస్థ ప్రటియేటా అవార్డులను అందిస్తుంది. ఇక పవన్ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవడంలో చూపిన మానవత్వం... చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండి వారికి వెన్నుదన్నుగా నిలిచిన విధానంతో పాటు పలు సామాజిక సమస్యలపై పవన్ చేస్తున్న కృషి, సుసంపన్నమైన సమాజస్థాపనకు ఆయన చూపుతున్న చొరవలకి ఫలితంగా ఈ అవార్డుకు ఆయన్ను ఎంపిక చేశారు.
మొత్తానికి పవన్ చేస్తున్న సేవలకు గాను ఆయనకు తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు లభించినట్లవుతుంది. ఈ అవార్డు వల్ల పవన్‌పై మరింత సామాజిక బాధ్యత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక పవన్ మామూలుగా సినిమాలలోనే కాదు.. సభలు, వేదికలపై కూడా ప్రసంగాలు చేసేటప్పుడు నుదిటి మీదకు పడే జుట్టును వెనక్కి నెడుతూ ఉంటారు. తాజాగా మాత్రం ఆయన తన జుట్టును పొట్టిగా కత్తిరించి, జుట్టుకి జెల్ రాసి పూర్తిగా పైకి దువ్వినట్లుగా ఆయన హెయిర్‌స్టైల్ కనిపిస్తోంది.
పాత కాలం వారి మాటల్లో చెప్పాలంటే తలంతా ఆముదం పూసి, 'గీతాంజలి' సినిమాలో నాగ్‌లాగా పవన్ మొత్తం జుట్టును వెనక్కి దువ్వి, పొట్టిగా కత్తిరించుకున్న జట్టుతో కొత్తగా కనిపిస్తున్నాడు. మరి ఈ స్టైల్ పవన్‌కి బాగా లేదని కొందరు అంటున్నారు. మరి ఇది త్రివిక్రమ్ చిత్రంలోని సన్నివేశాలలో కనిపించేదుకు ఇలా హెయిర్‌స్టైల్‌ని మార్చాడా? లేక ఇంకేదైనా రహస్యం ఉందా? అనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది...!