'జై లవ కుశ' చిత్రం చూసిన సగటు ప్రేక్షకులు మాత్రం పెద్దగా గొప్పగా లేదని, ముందుగా సోషల్ మీడియాలో 'జై' పాత్ర కోసమని కళ్లు లేని ఎన్టీఆర్ మాస్క్‌ని సినిమాలో వాడలేదని నిరాశగా ఉన్నారు. మొదట్లో జై పాత్ర కోసం హాలీవుడ్ నుంచి మేకప్‌మేన్‌ని రప్పించి ప్రోస్థటిక్ మేకప్ చేయిస్తున్నట్లు చెప్పిన యూనిట్ చివరగా సినిమాని చూస్తే మూడు పాత్రల గెటప్‌లు ఒకే విధంగా ఉండటంతో కాసింత నిరాశగా లోనవుతున్నారు. అయితే ప్రోస్థటిక్ మేకప్‌తో చిత్రం తీయాలంటే దాదాపు ఏడాది పడుతుందని, ఈ మేకప్ ప్రతిరోజు వేయడానికే నాలుగైదు గంటలు పడుతుందని, ఇక ఈ మేకప్ కేవలం ఆరుగంటలు మాత్రమే నిలిచి ఉంటుందని, ఈ మేకప్‌ని తీయడానికి మరో రెండు మూడు గంటలు పడుతుండటంతో పాటు, త్వరగా విడుదల చేయాల్సివుండటం, మరోవైపు ఈ చిత్రాన్ని తన సోదరుడే నిర్మిస్తుండటంతో భారీ బడ్జెట్‌తో తీయడం సరికాదని భావించి చివరకు ఆ ప్రోస్థటిక్ మేకప్‌న్ వద్దనుకున్నారని సమాచారం.
కానీ ఎన్టీఆర్ అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు మాత్రం ఎన్టీఆర్‌ని ఆకాశానికెత్తేసి ఆయనపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు 'నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం మా జూనియర్ తారకరాముడు... జైలవకుశ అమోఘం... జై ఒక అద్భుతం.. ఇంకెన్నో శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నా' అని పొగిడాడు. ఇక రాజమౌళి 'నా హృదయం గర్వంతో ఉప్పొంగింది తారక్' అని పొగిడాడు. ఇక తన ఫేవరేట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అని బహిరంగంగా చెప్పే సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బూ ఎట్టకేలకు రెండో రోజున 'జై లవకుశ' చిత్రం చూసిందట. తనకు మొదటి రోజు టిక్కెట్లు దొరకలేదని, రెందో రోజు ఎట్టకేలకు దొరికాయని ట్వీట్ చేసింది. ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానాన్ని మరోసారి ఆమె తన ట్వీట్‌తో లోకానికి చాటింది.
'జై-తారక్, లవ-తారక్, కుశ-తారక్' నా కళ్లకు ఆయనొక్కడే కనిపించాడు. మిగిలిన వారెవ్వరూ కనిపించలేదు. నేను తారక్‌ని మాత్రమే చూడగలిగాను.. అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఉప్పొంగేలా ట్వీట్ చేసింది. ఆమె ప్రశంసలు కూడా ఈ చిత్రానికి బూస్టప్‌గా పనిచేస్తాయని చెప్పవచ్చు. నిజంగానే ఖుష్బూ అభిప్రాయమే ప్రేక్షకుల్లో కూడా వ్యక్తమవుతోంది. ఈ చిత్రంలోని మూడు పాత్రల ద్వారా ప్రతిసీన్‌లో ఎన్టీఆరే కనిపించడం, ఇది ఎన్టీఆర్ వన్ మ్యాన్‌షో అయి తానే చిత్రమంతా కనిపించడంతో ఇదే మనోభావాన్ని సామాన్య ప్రేక్షకులు కూడా వ్యక్తం చేస్తున్నారు.