16 మంది కంటెస్టెంట్స్, 70 రోజులు, 60 కెమెరాలు, టాప్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత.... ఇది తెలుగు బిగ్ బాస్ సీజన్ వన్. ఇప్పుడా 70 రోజుల సమయం ముగిసిపోయింది. 16 మంది కంటెస్టెంట్స్ ఫైనల్స్ కి వచ్చేసరికి కేవలం ఐదుగురు మిగలడం.... వారిలో ఒక్కరే బిగ్ బాస్ సీజన్ విన్నర్ గా నిలవడం... ఈ ఆదివారం సాయంత్రం స్టార్ మా ఛానల్ లో ప్రసారమయిన గ్రాండ్ ఫినాలే లో జరిగింది. ఇక ఫైనల్ గా బిగ్ బాస్ విన్నర్ ని ప్రకటించడానికి తారక్ ఏకంగా నాలుగు గంటల సమయం తీసుకున్నాడు. స్టార్ మా లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ మొదలయితే దాదాపు నాలుగున్నర గంటలు అంటే రాత్రి 10 గం. 30 నిమిషాల వరకు ఈ షోని ఎన్టీఆర్ తన అల్టిమేట్ పెరఫార్మెన్సు తో సక్సెస్ ఫుల్ గా నడిపించాడు.
మొదటగా ఈ గ్రాండ్ ఫినాలే లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన ఆట, పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించగా... మధ్యలో ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యి ఇద్దరు కలిసి బిగ్ బాస్ స్టేజ్ మీద అందరిని అలరించారు. ఇక దేవిశ్రీ మొదటి అరగంటకు బిగ్ బాస్ షోని వదిలి వెళ్లిపోగా... ఎన్టీఆర్ ఎనర్జీ పెరఫార్మెన్స్ స్టార్ట్ అయ్యింది. ఎప్పటిలాగే ఎన్టీఆర్ తనదయిన పవర్ ఫుల్ పెరఫార్మెన్సుతో, తన వ్యాఖ్యానంతో ప్రేక్షకులందరిని ఉర్రుతలూగించాడు. ఇక ఈ నాలుగు గంటల్లో ఎన్టీఆర్ బిగ్ బాస్ అవార్డ్స్ ని ఆస్కార్ అవార్డ్స్ రేంజ్ లో ఇవ్వడం, ధనరాజ్, జ్యోతి, కార్తీక, సంపూ, సమీర్ ల బిగ్ బాస్ స్కిట్, మధు ప్రియా పాట, ప్రిన్స్, దీక్ష ల డాన్స్ పెరఫార్మెన్సు లతో బిగ్ బాస్ స్టేజ్ హోరెత్తింది.
ఇక బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్స్ లో శివబాలాజీ, ఆదర్శ్, అర్చన, నవదీప్, హరితేజలు మిగలగా ముందుగా అర్చన ఎలిమినేట్ పర్వంతో బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవ్వడం.. ఎలిమినేషన్, ఎలిమినేషన్ కి మధ్య స్టేజ్ మీద ఎంటర్టైన్మెంట్ జరగడం.... అలాగే నవదీప్, హరితేజ ల ఎలిమినేషన్ తర్వాత ఫైనల్ గా శివ బాలాజీ, ఆదర్శ్ లు మిగలడం... వారిరువురిని ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌస్ నుండి సాదరంగా తీసుకురావడం... బిగ్ బాస్ స్టేజ్ మీద ఎన్టీఆర్ బిగ్ బాస్ కౌన్ డౌన్ లో విన్నర్ ని ప్రకటించడం ఇలా ఆద్యంతం బిగ్ బాస్ షోని రక్తి కట్టించాడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ కి కూడా బిగ్ బాస్ కనబడకుండా ఒక సర్ ప్రైజ్ ఇవ్వడం... ఆ సర్ప్రైజ్ లో ఎన్టీఆర్ బిగ్ బాస్ మీద చేసిన జర్నీతో పాటే... బిగ్ బాస్ హౌస్ లో చేసిన మటన్ బిర్యానీ మూమెంట్స్ ని ప్రోమోలో చూపించడం అంతా బాగా ఆకట్టుకుంది
ఇక ఎన్టీఆర్ తన చేతుల మీదుగా ఫైనల్ విన్నర్ ని ప్రకటించిన తీరు అదిరిపోయింది. ఫైనల్ గా శివబాలాజీ, ఆదర్శ్ లో బిగ్ బాస్ సీజన్ విన్నర్ గా శివబాలాజిని ప్రకటించడం... ఇక ఎన్టీఆర్, శివ బాలాజీ కి బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ట్రోఫి తోపాటు 50 లక్షల ప్రైజ్ మని అందించడం ఆ ట్రోఫీ ని, మనీ ని శివ తీసుకుని హ్యాపీగా ఫ్యామిలీని కలవడం అన్ని బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో సూపర్. సో.. ఇదన్నమాట... తెలుగు బిగ్ బాస్ సీజన్ వన్. బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ శివబాలాజీ అయితే... బిగ్ బాస్ షో ని ఆద్యంతం రక్తి కట్టించిన ఎన్టీఆర్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.