దేశంలోని అతి ప్రధాన సమస్య అవినీతి. ఇలా అవినీతితో పై స్థాయి ఉన్నతాధికారుల నుంచి రాజకీయ నాయకుల వరకు కోట్లు సంపాదిస్తూ ఆ అవినీతి సొమ్మును బినామీల పేర్లతో దాచేస్తున్నారు. ఇక ప్రజల్లో నేడు అన్ని విషయాల కంటే అతి ముఖ్యమైన అంశం అవినీతి నిర్మూలనే అవుతోంది. కిందటి ఎన్నికల్లో బిజెపి దేశంలో ఏకంగా స్వాతంత్య్రం తర్వాత పూర్తి మెజార్టీ సాధించిన కాంగ్రేసేతర ప్రభుత్వంగా రికార్డుల కెక్కిందంటే సామాన్యుల నుంచి మేధావుల వరకు నల్లధనం వెలికితీత, అవినీతి నిర్మూలన చేస్తారనే ఆశతోనే అంతటి భారీ మెజార్టీ మోదీకి కట్టబెట్టారు. ఇక ఇప్పటి వరకు మోడీ అన్ని సంస్కరణలపై దృష్టిపెట్టారు. అవినీతి నిర్మూలన, నల్లధనం నిర్మూలనలో భాగంగా పెద్ద నోట్ల రద్దు నుంచి అనేక చర్యలు తీసుకున్నాడు.
అయితే విదేశాలలో పోగైన నల్ల కుబేరుల భరతం మాత్రం పట్టే చర్యలు తీసుకోలేదు. ఇక ఈ మూడున్నరేళ్లు కేవలం సంస్కరణలపై దృష్టి పెట్టిన మోదీ సర్కార్ రానున్న ఒకటిన్నర ఏడాది సమయాన్ని మాత్రం సంక్షేమ పథకాలు, ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించగలిగే అంశాలపై పెట్టనున్నాడు. ఇక విషయానికి వస్తే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అవినీతి సొమ్ముతో మారిన బినామీ వ్యవస్థను మాత్రం అంతం చేయలేక విఫలమవుతోంది. దాంతో ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయాలని సంకల్పించింది. తద్వారా ప్రజల దృష్టిలో కూడా అవినీతి వ్యతిరేకంగా తాము చిత్తశుద్దితో ఉన్నామనే పేరు దక్కించుకోవాలని చూస్తోంది. అవినీతి నిరోధవశాఖలో ఎలాగైతే ప్రజలను భాగస్వామ్యం చేసి, ఎవరి అవినీతి గురించైనా సమాచారం అందిస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పిన విధంగానే దేశంలోని ప్రజలు బినామీ ఆస్తులు కలిగిన వారి వివరాలు, ఇతర సమాచారం ప్రభుత్వానికి అందిస్తే దాని ద్వారా బినామీల అంతం చూడాలని నిర్ణయించుకుంది.
ఇలా సమాచారం అందించిన వారికి కనిష్టంగా 15లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల దాకా నజరానా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇలా సమాచారం అందించిన వారి వ్యక్తిగత వివరాలను రహస్యంగా ఉంచనుంది. ఇలా ఇన్‌ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు రక్షణ కల్పిస్తే అక్రమ బినామీదారుల సంగతి ప్రజలే చూసుకుంటారని ఆశిస్తోంది. త్వరలో ఈ పథకాన్ని ఆచరణలోకి తేవడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సిబిడిటి) వర్గాలు తెలియజేస్తున్నాయి. మరి ఈ విధానం వల్ల ఏమైనా ఫలితం ఉంటుందా? లేక స్వచ్చభారత్‌లాగా ఇది కూడా కేవలం ప్రజలను ఆకర్షించే పథకమా? అనేది తేలాల్సివుంది...!