భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కి.... ఇక ఆ సినిమా విడుదలవుతుంది అంటేనే నిర్మాతల గుండెల్లో గుబులు మొదలైపోతుంది. అసలు సినిమా ఫలితం గురించి వారు భయపడడంలేదు. తమ సినిమా విడుదలైన ఎంత సేపట్లో పైరసీ రూపంలో ఇంటర్ నెట్ లో వచ్చేస్తుందో అనే భయం పట్టుకుంది. అసలు సినిమాలు లీక్ చేసి యూట్యూబ్ లో పెట్టడం అటుంచి సినిమా విడుదలైన కొద్దిసేపటికే సినిమా ఇంటర్ నెట్ లో హల్చల్ చేస్తుంది అంటే నిర్మాతలకు టెంక్షన్ ఉండదా మరి. ఈ తరహా పైరసీ వెబ్సైట్ ఒకటి తమిళనాట దర్శక నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తుంది.
తమిళంలో సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే సినిమా పైరసీ రూపంలో ఆ వెబ్సైట్ లో ప్రత్యక్షమవుతుంది. తమిళనాట తమిళ రాకర్స్ అనే వెబ్సైట్ ఈ తరహా పైరసీని చేస్తూ నిర్మాతలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. కోట్ల పెట్టుబడితో సినిమాలు తెరకెక్కిస్తున్న నిర్మాతలకు ఆ తమిళ రాకర్స్ వెబ్సైట్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తమిళనాట ఈ తరహా పైరసీ వెబ్సైట్స్ చాలా ఉన్నప్పటికీ అన్నిట్లో ఈ తమిళ రాకర్స్ వెబ్సైట్ చాలా ప్రమాదకరంగా మారింది. ఇక ఈ తమిళ రాకర్స్ వెబ్సైట్ మొన్నామధ్యన సూర్య హీరోగా వచ్చిన సింగం 3 విడుదల అప్పుడు ఈ సినిమాని విడుదలైన మొదటి షో కే వెబ్సైట్ లో పైరసీ ప్రింట్ పెడతామంటూ హెచ్చరించింది.
ఇక ఇప్పుడు పైరసీ మీద యుద్ధం చేస్తున్న నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఈ తమిళ రాకర్స్ వెబ్సైట్ ని మూయించే దిశగా చర్యలు తీసుకుంటున్నాడు. మరి విశాల్ చేసే ప్రయత్నాలకు రెచ్చిపోయిన ఆ వెబ్సైట్ ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది. అదేమిటంటే వచ్చేనెలలో విడుదల కాబోతున్న విజయ్ తాజా చిత్రం మెర్సిల్ ని కూడా పైరసీ చేసి నెట్ లో పెడతామంటుంది. అయితే ఈ సినిమా విడుదలయిన రోజున కాకుండా 15 రోజుల తర్వాతే పైరసీ చేస్తామని ప్రకటించింది. తమ వెబ్సైట్ కి కొన్ని టెక్నీకల్ ఇబ్బందులు ఉండడంతో వాటిని సరి చేసుకున్న తర్వాత..... త్వరలోనే తమ విశ్వరూపం చూపిస్తామని హెచ్చరిస్తుంది. మరి విశాల్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియాల్సి ఉంది.