ఈ దసరాకి విడుదలవ్వాల్సిన సినిమాల్లో ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' విడుదలయింది. టాక్ తో సంబంధం లేకుండా..విడుదలయిన అన్ని చోట్లా 'జై లవ కుశ' కలెక్షన్స్ కొల్లగొట్టేస్తుంది కూడా. మరి ఈ దసరా బరిలో ఉన్న స్పైడర్, మహానుభావుడు సంగతేంటి. అంటే 'జై లవ కుశ' సినిమా విడుదలకు ముందు పబ్లిసిటీ కార్యక్రమాలను ఏ రేంజ్ లో చేసిందో తెలిసిన విషయమే. మరి సినిమా విజయంలో పబ్లిసిటీ అనేది ఆ సినిమా విజయానికి ఎంతగా దోహదపడుతుందో అనేది జై లవ కుశ ద్వారానే అర్ధమయ్యింది. మరి ఇప్పుడు విడుదల కాబోయే సినిమాల పరిస్థితి ఏమిటి అంటే.... స్పైడర్ చిత్రం పాటలను మార్కెట్ లోకి వదిలేసి... ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అదిరిపోయే లెవల్లో నిర్వహించేశారు.
కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత స్పైడర్ టీమ్ మళ్ళీ మీడియాకి చిక్కితే ఒట్టు. స్పైడర్ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కించి, విడుదల చేస్తున్నారు. మరి తమిళంలో మహేష్ డెబ్యూ చిత్రం కాబట్టి అక్కడ తమిళంలో స్పైడర్ పబ్లిసిటీని వీర లెవల్లో చేసి తెలుగులో మాత్రం స్పైడర్ పబ్లిసిటీని పట్టించుకోవడం లేదనే టాక్ ఉండనే వుంది. మరి సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజుల టైమే వుంది. కానీ స్పైడర్ కి సంబందించిన ఒక్క న్యూస్ కూడా బయటికి రావడంలేదు. మహేష్ గాని, రకుల్ ప్రీత్ సింగ్ గాని, దర్శకుడు మురుగదాస్ గాని స్పైడర్ పబ్లిసిటీ గురించి అస్సలు మాట్లాడడం లేదు. తెలుగులో సూపర్ బిజినెస్ చేసిన స్పైడర్ కి ఇక్కడ మాత్రం పబ్లిసిటీ కొరవడింది. కానీ తక్కువ మార్కెట్ ఉన్న తమిళంలో మాత్రం స్పైడర్ పబ్లిసిటీ ఆకాశాన్నంటుతుంది.
ఇక ఈ దసరా బరిలో ఉన్న మరో సినిమా మహానుభావుడు పబ్లిసిటీలో కొద్దిగా మెరుగ్గా వుంది. ఈ నెల 24 అంటే రేపు ఆదివారమే మహానుభావుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా ఆరు రోజులు టైం ఉంది. ఈలోపు హీరో శర్వానంద్ ఇంటర్వ్యూ, దర్శకుడు మారుతీ ఇంటర్వ్యూ, హీరోయిన్ మెహరీన్ ఇంటర్వ్యూలు ఉండనే ఉంటాయి. మరి ఈ రెండు సినిమాలు కూడా జై లవ కుశ పబ్లిసిటీని దృష్టిలో ఉంచుకుని తమ పబ్లిసిటీని కూడా పెంచుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. చూద్దాం ఈ నాలుగు, ఆరు రోజుల్లో ఈ రెండు సినిమాల పబ్లిసిటీ కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో...!