ఇండియన్ సినీ చరిత్రలోనే స్టార్ హోదా ఉండి కూడా మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌లుగా పేరు తెచ్చుకున్న నటీనటులు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. నసీరుద్దీన్‌షా, నానా పటేకర్, ప్రకాష్‌రాజ్ వంటి వారున్నా వారు విలక్షణ నటులే కానీ వారికి స్టార్ ఇమేజ్ లేదు. ఇక స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా తన సినిమాని, అందులోని పాత్రల కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేవారిలో కమల్‌హాసన్, అమీర్‌ఖాన్, విక్రమ్, సూర్యలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు.
ఇక ఓ పాత్ర కోసం తన స్టార్‌డమ్‌ని పక్కనపెట్టి ఎంతటి రిస్క్‌కైనా తెగించి, సినిమా హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా పాత్రలో పరకాయ ప్రవేశం చేసే స్టార్స్‌లో విక్రమ్ ఒకడు. ఆయన నటనా ప్రతిభ చూడాలంటే 'శివపుత్రుడు, అపరిచితుడు, ఐ' వంటి చిత్రాలను చూస్తే ఇలా చేసే నటులు కూడా ఉన్నారా? అనిపించి గర్వంగా ఫీలవవచ్చు. ఇక 'ఐ' చిత్రం కోసమైతే విక్రమ్ తన ప్రాణాల మీదికి కూడా తెచ్చుకున్నంత పని చేశాడు. కానీ ఆయనకు గత కొంతకాలంగా హిట్స్ లేవు. ముఖ్యంగా 'అపరిచితుడు' తర్వాత ఆ స్థాయి విజయం ఆయనకు దక్కలేదు. కానీ సినిమాలు ఆడకపోయినా విక్రమ్ నటనకు మాత్రం జేజేలు వినిపించాయి.
'మజా, మల్లన్న, రావణ్, వీడింతే, శివతాండవం, ఐ' వంటివి నిరాశపరిచాయి. కాగా ప్రస్తుతం విక్రమ్, విజయ్‌చందర్ అనే దర్శకునితో 'స్కెచ్' అనే టైటిల్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇది యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. కమర్షియల్ చిత్రమే అయినా ఈ చిత్రం కథ కొత్తగా, విక్రమ్ గెటప్, నటన ఎంతో వైవిధ్యంగా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరగుతోంది. నవంబర్ నాటికి సినిమాని పూర్తి చేసి డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారని తెలుస్తుంది. మరి ఈసారైనా విక్రమ్ 'స్కెచ్' ఫలిస్తుందో లేదో చూడాల్సివుంది...!