ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' చిత్రం థియేటర్స్ లోకి వచ్చేసింది. ఇక స్టార్‌మాలో ఎన్టీఆర్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న అతి పెద్ద తెలుగు రియాల్టీ షో త్వరలోనే ముగియనుంది. ఎన్టీఆర్ హోస్ట్ చేయడం, ఇన్ని వారాలుగా రోజూ ఈ తెలుగువారికి వినూత్నమైన షో వస్తుండటం, శనివారం, ఆదివారం ఎన్టీఆరే స్వయంగా షోకి హాజరై రక్తి కట్టించడం, ఇన్ని వారాలుగా ఒకే హౌస్‌లో కలసి ఉన్న పార్టిసిపెంట్స్, వారిని రోజు చూస్తూ వచ్చిన వీక్షకులకు ఈషో ముగియనుండటం కాస్త ఎమోషనల్ మేటరే.
ఇక ఇంతటి పాపులారీటిని దక్కించుకున్న బిగ్ బాస్ రియాల్టీ షోని రీప్లేస్ చేయడం సాధ్యం కాదు. అది జరగాలంటే మరో సీజన్ వరకు వెయిట్ చేయాలి. దీంతో బిగ్‌బాస్ ముగిస్తే ఏ షోతో ఈ ప్లేస్‌ని రీప్లేస్ చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా బిగ్‌బాస్‌ని ఓ డ్యాన్స్ షోతో రీప్లేస్ చేయనున్నారట. నేడు రియాల్టీ షోలలో 'బిగ్‌బాస్' తరహా విభిన్నమైన షోల తర్వాత కామెడీ షోలు, డ్యాన్స్ షోలకే ఎక్కువ ఆదరణ ఉంది. దాంతో స్టార్ మా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ షోకి ఆదాశర్మని న్యాయనిర్ణేతగా చేయడానికి ఒప్పించారు. మరో ప్రత్యేకత ఏమిటంటే పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్, జానీ మాస్టర్లు కూడా జడ్జ్‌గా వ్యవహరించనున్నారు. జానీ మాస్టర్ ఎలాగూ కొరియోగ్రాఫర్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఆదాశర్మ, రేణుదేశాయ్‌లు కూడా నాట్యంలో మంచి అనుభవం ఉండటంంతో వారిని దీనికి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి ఒప్పించారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా... రేణూదేశాయ్ వల్ల మాత్రం ఈ షోకి మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. స్టార్ ప్లస్‌లో వస్తున్న 'నాచ్ బలియో' షో తరహాలో నీతోనే డాన్స్ కార్యక్రమం రూపొందుతోంది.