టాలీవుడ్ లో ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నారు అంటే ఆ సినిమా మీద మంచి ఆసక్తి ఉండడమే కాదు... విపరీతమైన అంచనాలు కూడా ఉంటాయి. మరి మల్టి స్టారర్ చిత్రనికుండే క్రేజ్ అలాంటిది. అప్పుడెప్పుడో వెంకటేష్ - మహేష్ కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో నటించినప్పుడు ఆ సినిమాలో కథ బలంగా లేకపోయినా ఇద్దరు హీరోలు కలిసి కనిపించేసరికి ఆ చిత్రాన్ని బంపర్ హిట్ చేశారు ప్రేక్షకులు. అలాగే గోపాల గోపాల కూడా వెంకటేష్ - పవన్ కళ్యాణ్ లు కలిసి నటించారు. ఆసినిమా కూడా మంచి హిట్ అయ్యింది. మరి మల్టి స్టారర్ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాలి అంటే అది కత్తి మీద సామే. ఎందుకంటే ఇద్దరి హీరోలను సినిమాలో సమానంగా చూపించకపోతే ఇద్దరి హీరోల అభిమానులు రచ్చ రచ్చ చేస్తారు.
ఇకపోతే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఒక సూపర్ గాసిప్ హల్చల్ చేస్తుంది. అదేమిటంటే బాలకృష్ణ - మహేష్ బాబు కలిసి ఒక మల్టి స్టారర్ లో నటించబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. ఇక ఈ మల్టీ స్టారర్ దర్శకుడు ఎవరంటే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అంటున్నారు. బోయపాటి తాజాగా తయారు చేసిన కథకి మహేష్ - బాలకృష్ణ కరెక్ట్ గా సరిపోతారని.. అందుకే ఆ కథని సిద్ధం చేసి వారితో బోయపాటి శ్రీను సినిమా తెరకెక్కించబోతున్నట్లుగా ఫిలింసర్కిల్స్ లో వినబడుతున్న మాట. ఇప్పటికే బోయపాటి, మహేష్ ని కలిసి కథ గురించి చెప్పినట్లు.. కథ నచ్చిన మహేష్ స్పైడర్ విడుదల తర్వాత మరోసారి చర్చిద్దామని చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి.
మరి మహేష్ దగ్గరికి వెళ్లిన బోయపాటి, బాలయ్యని కూడా కలిశాడా? అంటే దానికి సమాధానం మాత్రం లేదు. నిజం గానే మహేష్ - బాలకృష్ణ మల్టీ స్టారర్ తెరకెక్కితే ఆ చిత్రానికి ఉండే క్రేజ్ అలాంటి ఇలాంటి క్రేజ్ కాదు. కానీ మహేష్ మాత్రం స్పైడర్ తర్వాత కొరటాల శివతో భరత్ అనే నేను చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాత వంశీ పైడి పల్లి డైరెక్షన్ లో దిల్ రాజు - అశ్వినీదత్ నిర్మాతలుగా ఒక కుటుంబ కథా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరొకవైపు బాలయ్య బాబు 102 వ చిత్రాన్ని కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తుంటే.... 103 వ చిత్రానికి కూడా బాలయ్య దర్శకుడిని లైన్ లో పెట్టినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఇలాంటి టైం లో బోయపాటి దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటించడం అనేది కేవలం గాసిప్ మాత్రమే అవుతుంది గాని నిజం కాదంటున్నారు.