టాలీవుడ్‌లో మణిశర్మ, కీరవాణి వంటి ఇద్దరు ముగ్గురిని మినహాయిస్తే పోటీ అంతా దేవి శ్రీ ప్రసాద్, తమన్‌ల మద్యే ఉంటోంది. కాగా వీరిద్దరిలో కూడా దర్శకనిర్మాతల, హీరోల మొదటి చాయిస్ మాత్రం దేవి శ్రీ ప్రసాదే. తమన్ కూడా అతి తక్కువ సమయంలో 50 చిత్రాలకు సంగీతం అందించాడు. స్టార్స్ చిత్రాలకు పనిచేశాడు. కానీ తమన్ అంటే కాపీక్యాట్ అనే చెడ్డపేరుంది. ఇక ఆయన దర్శకుడు సురేందర్‌రెడ్డికి ఆస్ధాన సంగీత విద్వాంసుడని చెప్పవచ్చు.
దీంతో చిరంజీవి నటించే 151వ చిత్రం 'సై...రా.. నరసింహారెడ్డి'కి మొదట తెలుగులో తీయాలని భావించినప్పుడు ఈ చిత్రం ద్వారా తమన్ మెగాస్టార్ నటించే చిత్రానికి సంగీతం అందించే చాన్స్ వచ్చిందని అందరూ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు. కానీ 'బాహుబలి' ఎఫెక్ట్‌తో 'సై..రా.. నరసింహారెడ్డి' బారీ క్యాస్టింగ్, సాంకేతిక నిపుణులతో ఏకంగా 200కోట్ల దాకా బడ్జెట్‌తో అన్ని భాషల్లో తీసి, విడుదల చేయాలని భావించడంతో అన్ని భాషల్లో క్రేజ్ కోసం తమన్‌ని పక్కనపెట్టి ఏ.ఆర్.రెహ్మాన్‌ని రంగంలోకి దించారు.
ఇక ఆ బాధను మరుస్తూ తమన్ సంగీతం అందిస్తున్న మూడు చిత్రాలు టీజర్లు, వాటి బ్యాగ్రౌండ్ స్కోర్లలో కేకపెట్టించాలని తమన్ ఉవ్విళ్లూరుతున్నాడు. ట్విట్టర్ ద్వారా ఈ న్యూస్‌ని తమన్ పోస్ట్ చేశాడు. శర్వానంద్ హీరోగా యువిక్రియేషన్స్ బేనర్‌లో మారుతి దర్శకత్వంలో వస్తున్న 'మహానుబావుడు' చిత్రం ట్రైలర్ నిన్ననే విడుదలైంది. ఇక రేపు నాగార్జున, ఆయనకు కాబోయే కోడలు సమంతలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న పివిపి వారి సినిమా 'రాజు గారి గది 2' ట్రైలర్ విడుదలకానుంది. ఇక ఆ తర్వాత మరో రెండు రోజుల గ్యాప్‌లో తమన్ తొలిసారిగా సంగీతం అందించిన బాలీవుడ్ మూవీ 'గోల్‌మాల్ ఎగైన్' ట్రైలర్ విడుదల కానుంది.
ఈ గోల్ మాల్ సిరీస్‌లో మొదటి చిత్రానికి 'విశాల్- శేఖర్', రెండు,మూడు భాగాలకు ప్రీతమ్ సంగీతం అందించారు. కానీ నాలుగో బాగానికి మాత్రం రోహిత్ శెట్టి... తమన్‌కి చాన్స్ ఇవ్వడం విశేషం. 'మహానుబావుడు, గోల్‌మాల్ ఎగైన్'లు ఎంటర్‌టైనర్‌గా వస్తుండగా, 'రాజు గారి గది 2' ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ మూడు చిత్రాలు బాగా ఆడితే తమన్ మరలా తెలుగులో పూర్వ వైభవంతో పాటు బాలీవుడ్‌లో కూడా పేరు తెచ్చుకోవడం ఖాయంగా చెప్పాలి.