మురుగదాస్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటించిన 'స్పైడర్' చిత్రం ఈనెల 27న విడుదల కానుంది. ఇప్పటికే పాటలతో పాటు ప్రమోషన్లు కూడా మొదలుపెట్టి చానెల్స్‌లో యాడ్స్ వేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి పడినంత కష్టం తానెప్పుడు పడలేదని మహేష్‌బాబు, రకుల్ ప్రీత్ సింగ్‌లు అంటున్నారు. ఈ చిత్రం బైలింగ్వల్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా మహేష్ కోలీవుడ్ ఎంట్రీకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు.
కానీ ఈ చిత్రం చాలా చిత్రాల మాదిరిగా డూప్లికేట్ బైలింగ్వల్ కాదు. గతంలో చాలా తమిళ చిత్రాలను ఏదో ఒకటి అరా తెలుగు వారి కోసం స్పెషల్‌గా తీసి, ఏదో బ్రహ్మానందం, బాబూమోహన్ వంటి వారితో కామెడీ ట్రాక్‌లు పెట్టి బైలింగ్వల్ అని ప్రచారం చేసేవారు. ఇంకొందరు అది కూడా చేయకుండా కొన్ని పాత్రలకు మన నటీనటుల చేత డబ్బింగ్ చెప్పించి వాటినే ద్విభాషా చిత్రాలుగా ప్రచారం చేసుకునే వారు. కానీ 'స్పైడర్' పరిస్థితి అది కాదు.
ఇది నిజమైన ద్విభాషా చిత్రం. ఈ చిత్రంలో తెలుగులో కొందరు నటిస్తే, తమిళంలో వారి నటులే నటించారు. ఇక ప్రతిషాట్‌ని తెలుగుకు వేరుగా, తమిళంకి వేరుగా రెండుసార్లు షూట్ చేశారు. చివరకు పాటలలో వచ్చే డ్యాన్స్‌లలోని మూమెంట్స్‌ని కూడా తెలుగులో ఒకరకంగా, తమిళంలో ఒక విధంగా స్టెప్స్‌ని కంపోజ్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈచిత్రాన్ని మొత్తం రెండుసార్లు చిత్రీకరించారనే చెప్పాలి. ఇక మహేష్‌బాబుకి తమిళం బాగా వచ్చు. ఆయన పుట్టింది, ఎక్కువగా పెరిగింది చెన్నైలోనే.
దాంతో మహేష్ తన తమిళ సీన్స్‌లో, సాంగ్స్‌లో బాగా పదాలు సింకయ్యేలా నటించాడట. కానీ రకుల్ మాత్రం తెలుగులో పెద్దగా కష్టపడకపోయినా తమిళ సీన్స్, పాటల కోసం లిప్ సింక్ సరిగా ఉండటం కోసం తాను కష్టపడి, తాను ఇంతగా ఎప్పుడు కష్టపడలేదని చెప్పుకొచ్చింది. మరి ఈ కష్టానికి తగ్గ ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే ఈనెల 27 వరకు ఆగాల్సిందే.