'బాహుబలి-ది బిగినింగ్, ఘాజీ,బాహుబలి-ది కన్‌క్లూజన్'లతో పాటు రానా సోలో హీరోగా నటించిన 'నేనేరాజు...నేనే మంత్రి' చిత్రంతో హిట్ కొట్టి తనకంటూ ఓ వర్గం ఫ్యాన్స్ ఉన్నారని, తన వైవిధ్యభరిత చిత్రాలను తెలుగు, తమిళం, బాలీవుడ్‌లో కూడా ఆదరిస్తారని నిరూపించుకున్నాడు. ఇలా పలు భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న రానా హీరోయిజం, పాటలు వంటి కమర్షియల్ అంశాలేవీ లేని 'ఘాజీ'తో కూడా హిట్ కొట్టాడు. ఇక ప్రస్తుతం రానా బుల్లితెరపై 'నెంబర్ వన్ యారీ'తో బిజీగా ఉన్నాడు.
ఇక త్వరలో 'సోషల్' అనే వెబ్‌సిరీస్‌లో కూడా నటిస్తున్నాడు. వీలుంటే బాబాయ్ వెంకటేష్‌తో కూడా కలిసి నటించే అవకాశం దక్కనుంది. ఇక తాజాగా ఆయన ఓ హాలీవుడ్ చిత్రంలో కూడా నటించడానికి ఓకే చెప్పి, అగ్రిమెంట్ కూడా చేశాడట. ఇటీవలే లండన్‌లో స్టోరీ డిస్కషన్స్ జరిగి, లోకేషన్ల ఎంపికలో యూనిట్ బిజీగా ఉంది. ఈ చిత్రం టైటిల్ 'విజిల్-ది మిస్టరీ ఆఫ్ ది ఫాంటమ్‌షిప్'. దీనికి ధ్వనిల్ మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు.
చిత్రం హాలీవుడ్ చిత్రమైనా కథ, కథనం అన్ని ఇండియా బ్యాక్‌డ్రాప్‌లోనే జరగనుంది. సౌరాష్ట్ర వద్ద ఓ నౌక మునిగిపోయి అంతర్ధానమైపోయిన విజిల్ అనే షిప్‌కి సంబంధించిన కథ ఇది. 700మంది ప్రయాణికులు ఉండగా తుఫాన్ సమయంలో ఈ షిప్ సముద్రంలో మాయమైపోయింది. ఆ షిప్ మాయమైన తర్వాత ఎలా మాయమైంది? అని కనుక్కునే సైంటిస్ట్ పాత్రలో రానా నటిస్తున్నాడు. ఈ చిత్రం హాలీవుడ్ కోసం ఇంగ్లీషులో తీసినా ఆతర్వాత ఒకేసారి తెలుగు,తమిళం, హిందీలతో పాటు పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
మొత్తానికి ఈ చిత్రం ద్వారా మరోసారి రానా దగ్గుబాటి తన వైవిధ్యభరిత చిత్ర కథ, సైంటిస్ట్‌గా రానా వైవిధ్యభరితమైన పాత్ర ద్వారా తన ఖాతాలో మరోహిట్‌ని కొట్టినట్లేనని, మరి ఆయనకు ఈ చిత్రం హాలీవుడ్‌లో ఎలాంటి గుర్తింపును తెస్తుందో వేచిచూడాల్సి ఉంది..!