చూడటానికి తమిళులు ఎంతో ప్రాంతీయ, భాషాభిమానులుగా కనిపిస్తారు కానీ వారు తమ భుజంపై ఎక్కించుకుని దేవుళ్లతో సమానంగా కొలిచిన ఎమ్జీఆర్, రజనీకాంత్, జయలలిత నుంచి అందరూ పర భాషా నటులే అన్నది సత్యం. ఇక ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సిద్దాంతాన్ని తారు మారు చేసి రచ్చ గెలిచిన తర్వాత ఇంట గెలవాలని చూస్తున్న హీరో విశాల్ కూడా తెలుగువాడే. ఆయన మహామహులని మట్టికరిపించి నడిగర్ సంఘం, నిర్మాతల మండలి ఎన్నికలలో గెలిచి కీలక స్థానాలను సొంతం చేసుకున్నాడు. అలా గెలిచిన వెంటనే నడిగర్ సంఘం బిల్డింగ్, దానిలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ప్రతి నెలా బాడుగల ద్వారా వచ్చే మొత్తాన్ని పేద, వృద్ద కళాకారుల పెన్షన్లను పెంచడానికి నిర్ణయం తీసుకున్నాడు.
ఇక తమిళనాట ఎన్నో కష్టాలు పడుతున్న రైతుల కోసం తమిళనాడులో ప్రదర్శితమయ్యే ప్రతి సినిమా టిక్కెట్‌లో ఏదో ఒకరోజు ప్రతి టిక్కెట్‌పై రూపాయిని రైతు సంక్షేమనిధికి కేటాయించాలనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఏరోజు, ఏ షోలో వచ్చిన కలెక్షన్లలలోని రూపాయిని నిర్మాతలు రైతు నిదికి చెల్లించాలనే నిర్ణయాన్ని, తేదీని త్వరలోనే ప్రకటిస్తాడు. ఇక ఆయన పైరసీ మీద కూడా పోరాడుతానని, ముఖ్యంగా ఆన్‌లైన్ పైరసీకి పాల్పడుతున్న తమిళరాకర్స్ పని పడతానని ఆయన ప్రకటించాడు. తాజాగా ఈ లీక్ సినిమాలను ఉంచే వెబ్‌సైట్‌కి చెందిన కీలకమైన అడ్మిన్‌ని ఆయన పోలీసులకు పట్టించాడు.
తాజాగా ఆయన నటించిన 'తుప్పారివారన్' చిత్రం విడుదల సందర్భంగా ఆయన తన అభిమానులతో కొన్ని గ్రూప్‌లను ఏర్పాటు చేశాడు. విశాల్ చిత్రం విడుదలై ఆడుతున్నఅన్ని థియేటర్లకు ఈ గ్రూప్స్ వెళ్లి నిఘా పెడతాయి. ఎక్కడైనా పైరసీకి సంబంధించిన తతంగం నడుస్తుంటే వెంటనే వారు విశాల్‌కి విషయాన్ని తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానం కనుక సక్సెస్ అయితే నిర్మాతల మండలి తరపునే అఫీషియల్‌గా కొందరు యువకులతో గ్రూప్స్‌ని సిద్దం చేసి సినిమా థియేటర్లలో జరిగే పైరసీని అడ్డుకట్ట వేయాలని విశాల్ భావిస్తున్నాడు. మొత్తానికి తెలుగువాడైన విశాల్ తమిళనాట తన చేతలతో అసలు సిసలు హీరో అనిపించుకుంటున్నాడు.