ఈ శుక్రవారం సుమారు 5 సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. విడుదల కష్టాలు అనుభవించి అనుభవించి ఎట్టకేలకు థియేటర్స్ లోకి వస్తుంది సునీల్ హీరోగా తెరకెక్కిన 'ఉంగరాల రాంబాబు' సినిమా. సునీల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా చాలా కష్టాలు పడి ముక్కుతూ మూలుగుతూ ఈ సెప్టెంబర్ 15 న విడుదలవుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో సునీల్ బిజీ బిజీగా ఉన్నాడు. ఛానల్స్ కి ఇంటర్వ్యూలు, బిగ్ బాస్ షోలోకి వెళ్లి ఉంగరాల రాంబాబుని ప్రమోట్ చెయ్యడం వంటి కార్యక్రమాలతో సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తున్నాడు. మరి ప్రమోషన్స్ విషయంలో ఈ వారం విడుదలవుతున్న ఉంగరాలు రాంబాబే ముందుంది.
ఇక సచిన్ జోషి హీరోగా తెరకెక్కిన 'వీడెవడు' మూవీ కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఇక సచిన్ జోషి కూడా 'వీడెవడు' ప్రమోషన్ ని బిగ్ బాస్ షోలో ఎప్పుడో మొదలెట్టేశాడు. అలాగే టీవీ సీరియల్స్ ద్వారా 'వీడెవడు' మూవీని ప్రమోట్ చేస్తూ మహిళా ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే బయట మాత్రం పెద్దగా హడావిడి లేకుండానే థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాడు సచిన్ జోషి. ఇక శింబు హీరోగా కోలీవుడ్ లో తెరకెక్కిన 'సరసుడు' కూడా ఈ శుక్రవారమే విడుదలవుతుంది. ఈ సినిమాని తెలుగు హక్కులను ఎవరు కొనకపోయేసరికి శింబు తండ్రి సొంతంగా ఆ సినిమాని తెలుగులో విడుదల చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమా కూడా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలవుతుంది.
అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నారా రోహిత్ హీరోగా నటించిన 'కథలో రాజకుమారి' సినిమా ఈ 15 నే ప్రేక్షకుల ముందుకు రావడం అందరిని ఆశ్చర్యం కలిగించే విషయమే. నారా రోహిత్ కి తెలుగులో మంచి మార్కెట్టేవుంది. మరి నారా రోహిత్ సినిమాలు తీసిపడేసే సినిమాలేవీ కాదు. ఆయన నటించిన 'సోలో, ప్రతినిధి, జ్యో అచ్యుతానంద' చిత్రాలు మంచి రిజల్టే ఇచ్చాయి. మరి ఇపుడు రోహిత్ హీరోగా తెరకెక్కిన 'కథలో రాజకుమారి' ఇలా సైలెంట్ గా థియేటర్స్ లోకి రావడం అనేది ఎవరికీ మింగుడు పడడం లేదు. సినిమా మొదలైనప్పుడు జనాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా.... 'కథలో రాజకుమారి' అనే టైటిల్ విడుదల చేసి సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు. మరి మధ్య మధ్యలో కూడా సినిమా పాటలు, ట్రైలర్ విడుదల చేసినప్పుడు కూడా కొద్దిగా అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాని అస్సలు ఎటువంటి ప్రమోషన్ లేకుండా ఇలా థియేటర్స్ లోకి తెచ్చెయ్యడం అనేది అర్ధం కానీ విషయమే.
ఇక సినిమా విడుదల తేదీని కూడా ఒక్క వారం ముందే ప్రటించారు కథలో.... మేకర్స్. అసలు 'కథలో రాజకుమారి' మీద అస్సలు ఎటువంటి క్రేజ్ లేదు. అయితే 'కథలో రాజకుమారి' థియేటర్స్ కూడా అంతంత మాత్రంగానే కేటాయించినట్లు తెలుస్తుంది. మరి నారా రోహిత్ తన సినిమాని ఇంతిలా పట్టించుకోకుండా వదిలెయ్యడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఇక ఈ సినిమా దర్శకుడు కొత్తవాడు కావడంతో ఈ సినిమా పరిస్థితి ఇలా తయారైందనే టాక్ వుంది.
ఇవన్నీ ఒక ఎత్తయితే దర్శకధీరుడు రాజమౌళి తండ్రి దర్శకత్వం వహించిన శ్రీవల్లి కూడా అనూహ్యంగా ఈ రేస్ లో ముందంజలో వుంది. చూద్దాం..ఈ సినిమాల్లో ఏది టాప్ ప్లేస్ లో నిలబడుతుందో..?