నేటిరోజుల్లో ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా నవరసాలు ఉంటేనే ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. హీరోయిజంతో పాటు పసందైన హీరోయిన్ల గ్లామర్‌రసం, ప్రేమ, టీజింగ్.. ఇలా యంగ్ స్టార్స్ సినిమాలో అన్ని వర్గాల ఆడియన్స్‌ని నచ్చేలా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక తన మొదటి చిత్రం 'అఖిల్'తో కేవలం యాక్షన్ చిత్రంగా చేసి దెబ్బతిన్న అక్కినేని అఖిల్ రెండో చిత్రం విషయంలో మాత్రం బోలెడు అంశాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాడు.
ఇక ఎలాగూ ఆయన తండ్రి, మంచి అనుభవం ఉన్న నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న చిత్రం కావడం, విక్రమ్ కె.కుమార్ వంటి ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఉండటంతో అఖిల్ రెండో చిత్రం 'హలో' కోసం దర్శకనిర్మాతలు కలిసి ఈ చిత్రంలో ఒక్క హీరోయిన్ ఉంటే చాలదని, మరో హీరోయిన్ కూడా ఉంటేనే యూత్‌ని బాగా అట్రాక్ట్ చేయవచ్చనే కమర్షియల్ సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా దర్శకుడు ప్రియదర్శన్, నిన్నటితరం హీరోయిన్ లిజిల కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది.
ఇక రెండో హీరోయిన్ పాత్రకు నివేదితా సతీష్ పేరు వినిపిస్తోంది. జ్యోతిక ప్రధాన పాత్ర పోషించిన 'మగళిర్ మట్టుమ్' చిత్రంలో ఈ అమ్మడు ఓ కీలకపాత్రను పోషించిందని సమాచారం. దీంతో అఖిల్ ఈ చిత్రంలో ఇద్దరు గోపికల కృష్ణుడిలా ఇటు రొమాన్స్‌ని, అటు హీరోయిజాన్ని చూపించనున్నాడని అర్ధమవుతోంది.