చిరంజీవి 151 వ సినిమా ఆఫీషియల్ గా సెట్స్ మీదకెళ్లింది. అయితే చిరు 151 వ సినిమా 'సై రా నరసింహారెడ్డి'ని భారీ లెవల్లో ఇండియా మొత్తం మార్మోగిపోయేలా ఎనౌన్స్ చెయ్యడమే కాదు.... గ్రాండ్ ఈవెంట్ ఒకటి నిర్వహించి 'సై రా' మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని రామ్ చరణ్ కళ్ళు చెదిరిపోయే బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఆఫీషియల్ గా మొదలైన ఈ సినిమా ప్రస్తుతానికి ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉందంటున్నారు. ఇంకా స్క్రిప్ట్ పక్కాగా లాక్ చెయ్యలేదని... అందుకే 'సై రా' రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదంటున్నారు.
ఇకపోతే ఈ 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్, కన్నడంలో పాపులర్ అయిన నటులు నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలుగులో కూడా 'సై రా' కోసం టాప్ నటీనటులనే ఎంపిక చేసింది చిత్ర బృందం. ఒకప్పుడు హీరోగా నటించి.... ఆ తర్వాత బాలకృష్ణ నటించిన 'లెజెండ్' సినిమాలో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన జగపతిబాబు కూడా ఈ 'సై రా' లో ఒక కీలక పాత్రకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ మధ్యన జగపతి బాబు కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను, విలన్ గాను దూసుకుపోతున్నాడు.
అందుకే 'సై రా' లో కూడా జగపతి బాబుని నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రకే చిత్ర బృందం ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. ఇక 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో నరసింహారెడ్డి వెన్నంటే ఉంటూ ఆంగ్లేయులకు ఉప్పందించి వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్‌లో జగపతిబాబు నటించనున్నట్టు గా చెబుతున్నారు. అంటే మళ్ళీ మరోసారి జగపతిబాబు విలన్ గా అదరగొట్టనున్నాడన్నమాట. ఇక 'లెజెండ్' లో బాలయ్యకి పోటీగా విలన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసిన జగపతి బాబు... ఇప్పుడు చిరు 'సై రా'లో చిరుకి విలన్ గా నటించి మెప్పు పొందడానికి రెడీ అవుతున్నాడన్నమాట.