మనసులో ఏమున్నా కూడా ప్రతి నటీనటుడు మంచి చిత్రాలను చేయాలనే భావిస్తాడు. తాము ఒప్పుకుని చేసే సినిమాలన్నీ మంచివేనని భావిస్తారు. ఎవరో ఒకటిఅరా అవకాశాలు లేకపోవడంతో ఏ పాత్ర అయితే ఏముంది? అవకాశం వచ్చి, ఎప్పుడు బిజీగా ఉంటే చాలని అనుకునే వారు అరుదు. అలా అవకాశాలే లేక ఏది పడితే అది ఒప్పుకున్నప్పటికీ ఎవ్వరూ ఆ మాట చెప్పరు. తమకు ఎంతో నచ్చిన పాత్ర అని, మంచి కంటెంట్ ఉన్న చిత్రమని, హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని, కేవలం పాటలకే పరిమితమయ్యే పాత్ర కాదని.. ఇలాంటి బోలెడు పదాలు నటీనటులకు తెలుసు.
ఇప్పుడు బాలీవుడ్ సెక్స్‌బాంబ్, బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పని అలియా భట్ కూడా అవే చిలక పలుకలు పలుకుతోంది. ఆమె మాట్లాడుతూ, కంటెంట్‌లేని చిత్రాలు చేసి ప్రేక్షకులను మోసం చేయలేను. ఫలానా నటికి ఆ అవకాశం దక్కిందే.. నాకు ఆ అవకాశం రాలేదే అని బాధపడే వ్యక్తిత్వం నాది కాదు. ఏదీ శాశ్వతం కాదు.. ఈరోజు నాది.. రేపు మరొకరిది. ఎప్పుడు విజయాలే సాధించాలని కోరుకోను. కేవలం విజయాల కోసం చిత్రాలు చేయడం లేదు.
నాకు నాలుగేళ్ల వయసు నుంచే సినిమాలలో నటించాలనే కోరిక ఉండేది. ఆ కోరిక ఇప్పటికీ అలాగే ఉంది. దాన్ని నెరవేర్చుకోవడం కోసమే సినిమాలు చేస్తున్నాను. అందులోనూ మంచి సినిమాలే ఎంచుకుంటాను. కంటెంట్ లేని చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను మోసం చేయలేను. అలా ఆలోచిస్తాను కాబట్టే.. నా సినిమాలు విజయం సాధిస్తాయని వేదాంతం చెబుతోంది. మొత్తానికి జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీకి ఈమెను వారసురాలిగా భావించాలేమో.....!