కొద్దికాలం కిందట అల్లుఅర్జున్‌కి సంబంధించిన ఓ కార్యక్రమంలో పవన్‌కళ్యాణ్ అభిమానులు తమ హీరో గురించి మాట్లాడాలని బన్నీని అడిగితే, ఏదో నాలుగు మాటలు మాట్లాడితే సరిపోయేదానికి ఆయన 'చెప్పను బ్రదర్' అనే వ్యాఖ్య చేయడం, దాంతో పవన్ అభిమానులు ఇప్పటికీ అల్లుఅర్జున్‌ని శత్రువుగా చూస్తూ నానా రచ్చ చేస్తున్నది అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ విషయంలో బన్నీ మాత్రం మరలా కాస్తైనా పట్టువిడుపు లేకుండా పవన్ ఫ్యాన్స్‌లో అమీతుమీకి సిద్దమై, తాను మాత్రం తన మాట మీదే నిలబడి, ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు.
కానీ ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ చెప్పాలని మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు బన్నీపై ఒత్తిడి తెచ్చినా, ఆయన మాత్రం వాటిని లెక్కపెట్టడం లేదు. ఇక తాజాగా బన్నీకి సర్దిచెప్పి, బన్నీ చేసిన గాయానికి ఆయింట్‌మెంట్ పూసే బాధ్యతలను మెగాబ్రదర్ నాగబాబు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈమధ్య బాగా ఆర్ధికంగా దెబ్బతిన్న మెగా బ్రదర్ నాగబాబుకు మరలా బన్నీ తన 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రం నిర్మాణంలో లగడపాటి శ్రీధర్‌కి భాగస్వామిని చేశాడు. ఇది కూడా పవన్ అభిమానులను శాంతపరచడానికి బన్నీ తరపున మెగాబ్రదర్ నాగబాబు చేస్తున్న దౌత్యానికి కారణంగా కొందరు విశ్లేషిస్తున్నారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ, 'చెప్పను బ్రదర్' అని బన్నీ తొందరపడి అనినా కూడా వెంటనే సర్దుకున్నాడని చెప్పాడు. మరి ఎవరికీ బన్నీ ఎప్పుడు ఎలా సర్దుకున్నాడు? అనేది మాత్రం తెలియడం లేదు. ఇక మరో వేడుకలో పవన్ ఎందుకు రాలేదని అభిమానులు గోల చేస్తుంటే వారిపై నాగబాబు కూడా ఫైర్ అయ్యాడు. ఆ విషయం గురించి కూడా నాగబాబు వివరణ ఇస్తూ, తాను పవన్ అభిమానులందరినీ ఉద్దేశించి ఆరోజు అసహనం వ్యక్తం చేయలేదని, అక్కడ గోల చేస్తున్న కొందరిని ఉద్దేశించి మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చాడు.
చిరంజీవి, పవన్‌కళ్యాణ్, రామ్‌చరణ్, అల్లుఅర్జున్, సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్... ఇలా అందరికీ ఎవరికి వారు ఫ్యాన్స్ ఉన్నా.. అందరూ అందరి చిత్రాలను చూసి ఆదరిస్తున్నారని నాగబాబు చెప్పుకొచ్చాడు. అందుకే వారిని తాను మెగాఫ్యాన్స్‌గా చూస్తానే గానీ, వాళ్లలో ఎలాంటి చీలిక లేదని ఆయన చెప్పాడు. అయితే ఇప్పుడు నాగబాబు మాటలు చూస్తే ఒకప్పటి కంటే ఇప్పుడు బాగా తేడా కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన బన్నీతో 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రం ద్వారా లబ్దిపొందడమే కాదు.. కొంతకాలం కిందటి వరకు తాను మెగాస్టార్ చిరంజీవి వైపే ఉంటానని,ఆయన ఏ పార్టీలో ఉంటే తాను కూడా అందులోనే ఉంటానని, కాబట్టి ప్రస్తుతం తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని చెప్పిన నాగబాబు, తాజాగా మాత్రం జనసేనలోకి రమ్మని పవన్ పిలిస్తే వస్తానని, ఆయన ఆదేశిస్తే సామాన్య కార్యకర్తగా కూడా పనిచేస్తానని చెబుతూ ఉండటం, మెగా హీరోలు కాకుండా మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ లు అంటే ఇస్తామని చెప్పడం చూస్తుంటే.. మళ్లీ నిర్మాతగా మారిన నాగబాబు అందరికి గాలం వెయ్యడానికే ఇలా చేస్తున్నాడనే తేడా కొట్టొచ్చినట్లు కనబడుతుంది.