సంజయ్‌దత్.. ఈయన పేరు ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ ఊపు ఊపింది. ఆయన నటించిన 'ఖల్‌నాయక్'తో పాటు పలు చిత్రాల ద్వారా ఆయన ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. కానీ అంతటి పీక్స్‌లో ఉన్న సమయంలో ముంబైలో జరిగిన పేలుళ్ల అనంతరం ఆయన అక్రమాయుధాలు కలిగి ఉన్న కేసులో అరెస్ట్ అయ్యాడు. టాడా కింద 1993లో ఆయన జైలు పాలయ్యాడు. దాంతో ఆయన కెరీర్ నాశనం అయింది. ఇక ఆయన జీవితం చూసుకుంటే అదో క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని తలపిస్తుంది. చిన్నతనంలోనే డ్రగ్స్‌కి అడిక్ట్ కావడం, చివరకు ఆ అలవాట్ల నుంచి బయటపడి తన కెరీర్‌పై దృష్టి పెట్టిన నేపథ్యంలో అక్రమాయుధాల కేసు ఆయన కెరీర్‌ను ఓ కుదుపు కుదిపింది. ఆయన తండ్రి సునీల్‌దత్ నటుడే కాదు.. ప్రముఖ గాంధేయవాది, రాజకీయనాయకుడు కూడా. ఆయనకు నాటి ప్రధానితో పాటు అందరు ప్రధానులతో ప్రముఖ రాజకీయనాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన తలుచుకుని ఉంటే సంజయ్‌దత్‌ని ఎలాగోలా పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్‌తో బయటకు తీసుకుని వచ్చేవాడు. కానీ అలా జరుగలేదు.
మరోవైపు సల్మాన్ ఖాన్ 'కృష్ణ జింకల కేసు' నుంచి చివరికి 'హిట్ అండ్ రన్' కేసులో పలువురి ప్రాణాలను బలిగొన్న కేసు నుంచి కూడా తప్పించుకున్నాడు. కానీ సునీల్‌దత్, సంజయ్‌దత్‌లు ఆ పనిచేయలేకపోయారు. నాటి మహారాష్ట్ర హిందూవాది బాల్‌థాకరే నుంచి అందరు సంజయ్‌ని అమాయకుడిగానే భావించారు. కానీ అవేమీ ఆయన కేసును తప్పించలేకపోయాయి. ఇక సత్ప్రవర్తన కారణంగా కొద్దికాలం ముందుగా జైలు నుంచి వచ్చిన ఆయన్ను మరలా జైలుకు పంపడానికి కూడా కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇక సంజయ్‌దత్ జీవిత చరిత్రకు చెందిన ఓ చిత్రాన్ని రాజ్‌కుమార్ హిర్వాణి తీస్తున్నాడు. మరోవైపు సంజయ్‌దత్ 'భూమి' అనే చిత్రంతో పాటు 'ది గుడ్ మహారాజా' అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.
ఇక 'భూమి' చిత్రం ప్రమోషన్లలో భాగంగా సంజయ్‌దత్ మాట్లాడుతూ, ఇప్పటికీ నేను అమాయకుడినే అని భావిస్తున్నాను. నేను జైల్లో ఉన్నప్పుడు చాలా నేర్చుకున్నాను. అప్పుడు ఇప్పుడు నేను అమాయకుడినే. కానీ నా జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి... అని అంటున్నాడు. నిజమే.. రాజకీయ కుట్రకు బలైన సంజయ్ నిజజీవితంలో నేర్చుకోవాల్సిన కుటిల, ఇతర రాజకీయాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'భూమి' చిత్రం సెప్టెంబర్ 22న విడుదలకు సిద్దమవుతుండగా, ఇందులో ఆదితీరావ్‌హైదరీ సంజయ్ కూతురు పాత్రలో నటిస్తోంది.