ఎన్టీఆర్ నటించిన 'టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్' చిత్రాల విడుదలప్పుడు ఆ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు. దాంతో యబౌ యావరేజ్ అనిపించిన 'జనతాగ్యారేజ్' సైతం ఏకంగా ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత పెద్ద హిట్‌గా నిలిచింది. కానీ ఈ హ్యాట్రిక్ తర్వాత వస్తున్న 'జై లవకుశ' చిత్రంపై మాత్రం ఎన్టీఆర్ అభిమానుల్లోనే కాదు.. సామాన్య ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రంలోని మూడుపాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన మూడు పాత్రల లుక్కులు, మూడు టీజర్లు కూడా బాగానే అలరిస్తున్నాయి. ఇక ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఎన్నోకథలు విని, చివరకు బాబీ వంటి ఫెయిల్యూర్ దర్శకునితో ఈచిత్రం చేస్తుండటం, మరోవైపు దీనిని తన మనసుకి నచ్చిన చిత్రంగా ఎన్టీఆర్ పేర్కొనడంతో దీనిలో సమ్‌థింగ్ స్పెషల్ ఏమిటో ఉందనే బలమైన నమ్మకంతో అందరూ ఉన్నారు.
ముఖ్యంగా ఈ చిత్రంలోని నెగటివ్ షేడ్స్ కలిసి, ఎంతో క్రూరమైనలుక్‌లు, నవ్వు, హావభావాలతో ఉన్న 'జై' పాత్రపై మాత్రం ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. ఇక ఆ పాత్ర డైలాగ్ డెలివరి, నత్తితో, క్రూరంగా మాట్లాడటం అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ఈ మూడు పాత్రలను కలిపి ఒకే ఫ్రేమ్‌లో చూపించడం మరింతగా ఆకట్టుకుంటోంది. మొత్తంగా చెప్పాల్సి వస్తే కేవలం 'జై' పాత్ర ఒక్కటే కోట్ల అంచనాలను తీసుకుని వస్తోంది. మరోవైపు 'బిగ్‌బాస్'షో తో ఎన్టీఆర్ ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా దగ్గరకావడం, ఓవర్‌సీస్‌లో నిన్నామొన్నటివరకు పెద్దగా ఊపులేని ఎన్టీఆర్ దీని ముందు వచ్చిన మూడు చిత్రాలతో ఓవర్‌సీస్‌లో కూడా మెప్పించడం వంటి అనేక సానుకూలతలు దీనికి ఉన్నాయి.
అయినా 'జై' పాత్ర మాత్రం అంచనాలను అందుకోలేకపోతే అది మరింత ప్రమాదకరంగా మారడం మాత్రం ఖాయం. ఇక ఈ 'జై' పాత్ర సామాన్యులనే కాదు.. సినీ సెలబ్రిటీలను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. రాజమౌళి, రాఘవేంద్రరావుల నుంచి తాజాగా సాయిధరమ్‌తేజ్ వరకు ఈ పాత్రని తెగ పొగిడేస్తున్నారు. తాజాగా సాయి 'చ...చ..చ..చంపేశావ్ తారక్' అంటూ ట్విట్టర్‌తో తనదైన స్టైల్‌లో ఈ పాత్రను ఆకాశానికెత్తేశాడు. మొత్తానికి ఈ చిత్రాన్ని నిలబెట్టినా అది 'జై'నే.. లేక తేడా కొట్టినా కూడా అది 'జై' పాత్రపైనే ఆధారపడి ఉందని చెప్పవచ్చు.