ఒకసారి సుడి అనేది గనక తిరిగింది అంటే దానిని ఎవరూ ఆపలేరు అనే సత్యాన్ని 'అర్జున్ రెడ్డి' చిత్రం వారం వారం నిరూపిస్తూనే వుంది. 4.5 కోట్ల బడ్జెట్ తో చిన్న చిత్రంగా తెరకెక్కిన ఈ 'అర్జున్ రెడ్డి' చిత్రం ఇప్పటికే 23 కోట్ల కలెక్షన్స్ తో దున్నేస్తుంది. సినిమాకి విపరీతమైన నెగెటివ్ పబ్లిసిటీ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి నెగటివ్ పబ్లిసిటీతో ఏ సినిమా విడుదల కాలేదు. ఈ సినిమా పూర్తి నెగెటివ్ పబ్లిసిటీతోనే ఆగష్టు 25 న విడుదలైంది. ఆ వారం అర్జున్ రెడ్డితో పాటు రిలీజైన అజిత్ 'వివేకం', ధనుష్ 'విఐపి 2' సినిమాలని ప్రేక్షకులు తిరస్కరించి 'అర్జున్ రెడ్డి' కి పట్టం కట్టారు.
ఇక ఆతర్వాతి శుక్రవారం సెప్టెంబర్ 1 న బాలకృష్ణ - పూరి ల క్రేజీ కాంబో 'పైసా వసూల్' వచ్చింది. ఆ సినిమా కూడా నెగెటివ్ టాక్ తో 'అర్జున్ రెడ్డి' చిత్రానికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ కుమ్ముకోమని దారిచ్చింది. రెండు వారాలకు 'అర్జున్ రెడ్డి' అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక మూడో శుక్రవారం అంటే సెప్టెంబర్ 8 న విడుదలైన నాగ చైతన్య 'యుద్ధం శరణం', అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' చిత్రాలు కూడా చేతులెత్తేసే పరిస్థితి కనబడుతుంది. ఆ రెండు సినిమాలకు కూడా నెగెటివ్ టాక్ రావడంతో మళ్ళీ 'అర్జున్ రెడ్డి'కి కలిసొచ్చింది. 'అర్జున్ రెడ్డి' కలెక్షన్ కి ఏ ఢోకా లేదని తేలిపోయింది.
ఇక నాలుగో వారం అంటే సెప్టెంబర్ 15 న సచిన్ జోషి 'వీడెవడు', సునీల్ హీరోగా వస్తున్న 'ఉంగరాల రాంబాబు', నారా రోహిత్ 'కథలో రాజకుమారి', విజయేంద్ర ప్రసాద్ 'శ్రీవల్లి' చిత్రాలు వస్తున్నాయి. సచిన్ జోషి సినిమాలెలా ఉంటాయో తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఇక సునీల్ 'ఉంగరాల రాంబాబు' విడుదల కష్టాలను దాటి ఎట్టకేలకు విడుదలవుతుంది. నారా రోహిత్ 'కథలో రాజకుమారి', విజయేంద్ర ప్రసాద్ 'శ్రీవల్లి' చిత్రాల ను ఎదుర్కోవాలి. మరి ఈ నాలుగు చిత్రాలు 'అర్జున్ రెడ్డి'ని తట్టుకుని నిలబడగలవా!. ఇక 'అర్జున్ రెడ్డి' కి అడ్డుకట్ట వెయ్యాలి అంటే ఈ నెల 21 న 'జై లవ కుశ' వల్లే అవుతుంది అంటున్నారు. అంటే 'జై లవ కుశ' థియేటర్స్ లోకి దిగే వరకు 'అర్జున్ రెడ్డి'కి ఎదురే లేదన్నమాట. ఇదే కదా 'అర్జున్ రెడ్డి' సుడి అంటే.