వారం కిందటి నుంచి జాడ తెలియకుండా పోయిన సోనియాగాంధీ కమెండో రాకేశ్ కుమార్ జాడను ఢిల్లీ పోలీసులు కనిపెట్టారు. ఢిల్లీలోని లూటియన్స్ ప్రాంతంలో అతను అత్యంత దీనమైన స్థితిలో తిరుగుతున్నట్లు గుర్తించారు. అరెస్ట్ చేసిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) కమెండో రాకేశ్ కుమార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం 10జన్‌పథ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. అతగాడి పేరు మీద బ్యాంకులో 4లక్షల రూపాయల లోన్ ఉంది. ఆగష్టు 31న తన వద్ద ఉన్న మొత్తం 40 వేలు రూపాయలను ఇన్‌స్టాల్‌మెంట్ కింద కట్టేశాడు.
చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో వారం రోజుల పాటు ఇంట్లో ఎవ్వరికి కనిపించకుండా పోవాలని నిర్ణయించుకున్నాడు. సంపన్నులు నివాసం ఉండే లూటియన్స్ ప్రాంతంలోని పార్క్‌లలో తిరుగుతూ, కాలం వెళ్లబుచ్చాడు. చివరకు తిలక్ మార్గంలో దారుణ స్థితిలో అతన్ని చూడాల్సి వచ్చింది. తినడానికి తిండి, తాగేందుకు నీరు లేక అడుక్కుంటూ అతను ఓ వ్యక్తి కంట పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు చేయించి కుటుంబసభ్యులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. సోనియాగాంధీ సెక్యూరిటీ కమెండో గా చేస్తున్న రాకేశ్ కుమార్ పరిస్థితే ఇలా వుంది అంటే..నిజాయితీ గా పని చేసే పోలీసులు, ఆర్మీ ఇలాంటి వారంతా రాకేశ్ కుమార్ చేసిందే చేయాలి వస్తుందేమో..!