ఆవు చేలో మేస్తుంటే... దూడ గట్టున మేస్తుందా? అన్నట్లుగా టీవీ చానెల్స్‌లో వస్తున్న 'డ్యాన్స్ బేబీ డ్యాన్స్' షోలలో అశ్లీల నృత్య భంగిమలు, చిన్న పిల్లలకు కూడా అర్ధంకాని శృతిమించిన వల్గారిటీ నిత్యం టీవీ చానెల్స్‌లో వస్తూనే ఉంటున్నాయి. దీంతో ఈ పేరుతో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా అర్ధనగ్న, అశ్లీల నృత్యాలు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు రికార్డిండ్ డ్యాన్స్‌ల మాటున అశ్లీలత ఉండేది. కానీ ఇప్పుడు వాటి పేరును మార్చి 'డ్యాన్స్ బేబీ డ్యాన్స్' పేరుతో గ్రామాలలో, ముఖ్యంగా ప్రధాన రహదారులకు దూరంగా, పోలీసులు పెద్దగా మాటువేయని మారు మూల గ్రామాలలో అశ్లీల నృత్యాలు మితిమీరి పోతున్నాయి.
విశాఖ జిల్లాలోని పలు చోట్ల గణేషుని ఉత్సవాల రూపంలో ఎలాంటి అసభ్యత లేని సాంస్కృతిక కార్యక్రమాలను చేసుకోవాలని పోలీసులు అనుమతులు ఇస్తే, నిర్వాహకులు మాత్రం ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ముసుగులో రికార్డిండ్ డ్యాన్స్‌లను మించిన అశ్లీలత ఉండే కార్యక్రమాలను నిర్వహించడం సర్వ సాధారణమైపోయింది. ముఖ్యంగా నిర్వాహకులు డ్యాన్సర్లకు కూల్‌డ్రింక్స్‌లో మద్యం కలిపి ఇస్తూ తాగిస్తుండటంతో ఈ డ్యాన్సర్లు ఆ మత్తులో పలు అశ్లీలాలకు తెరదీస్తున్నారు. వాస్తవానికి 15ఏళ్ల కిందట ఓ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్‌లోని డ్యాన్సర్‌ని కొందరు అత్యాచారం చేసి, చంపేశారు. దాంతో విశాఖ జిల్లాలో ఇలాంటి డ్యాన్స్‌లను పోలీసు అధికారులు నిషేధించారు. కానీ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్‌ల వారు మరలా తమ పొట్టగొట్టవద్దని ఎన్నో ఆందోళనలు చేసినా నాటి ఎస్పీ ఏమాత్రం చలించకుండా వీటిపై పటిష్ట నిషేధం అమలు చేశారు. దాంతో రాను రాను ఇలాంటి కార్యక్రమాలను రికార్డింగ్ డ్యాన్స్‌ల రూపంలో కాకుండా డ్యాన్స్ బేబీ డ్యాన్స్‌ల మాటున నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాల నిర్వాహకులకు ప్రజా ప్రతినిధులు, ఇతర పోలీసు అదికారులు, నాయకుల అండ కూడా బాగానే ఉంటోంది. ఏదో పండగ కదా...! కాలక్షేపం కోసం ప్రజులు ఏదో చేస్తున్నారు. వాటిని గూర్చి సీరియస్‌గా తీసుకోవద్దని పోలీసులకు గ్రామ పెద్దలు నచ్చ జెపుతున్నారు. ఇక వినాయక ఉత్సవాలు ముగిశాయి. మరికొన్నిరోజుల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు, సంక్రాంతి సంబరాలు, ఆ తర్వాత గ్రామ దేవతల ఉత్సవాలు జరుగనున్నాయి. మరి వినాయక ఉత్సవాలలో చోటు చేసుకున్న పరిస్థితులను చూసైనా ఈ అశ్లీల నృత్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.