ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. అందరూ అన్ని విషయాలలో నిష్ణాతులు కాలేరు. ఇక యంగ్‌టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే వాక్చాతుర్యంలో, తన మాటలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో ఆయన ఘటికుడు. ఇక పవన్‌కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన సమాజంలో జరగుతున్న సంఘటనలు, ప్రజల సామాజిక సమస్యలపై అనర్ఘళంగా మాట్లాడగలరేమో గానీ ఎన్టీఆర్‌లా జోకులు వేస్తూ, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేలా పవన్ మాట్లాడలేడు అనేది అందరూ ఒప్పుకుంటారు. ఎమోషనల్ స్పీచ్‌లు ఇవ్వగలడే గానీ ఎంటర్‌టైన్‌మెంట్ బేస్‌డ్ మాటల గారడీ ఆయన చేతకాదు. మీడియా ముందు తన సినిమా గురించి నాలుగు మాటలు మాట్లాడటానికే పవన్ బిగుసుకుని పోతాడు.
ఇక స్టార్‌మా చానెల్‌లో ఎన్టీఆర్ 'బిగ్‌బాస్' రియాల్టీ షో చేస్తున్న సంగతి తెలిసిందే. తాను తప్ప మరెవ్వరూ ఆ స్థాయిలో చేయలేరు అనిపించే విధంగా ఆ షోని ఎన్టీఆర్ రక్తి కట్టిస్తున్నాడు. తమిళంలో కమల్‌హాసన్ కంటే తెలుగులో ఎన్టీఆరే బాగా హోస్ట్ చేస్తున్నాడని ప్రశంసలు లభిస్తున్నాయి. కానీ ధనాధన్ ధన్‌రాజ్ మాత్రం తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తర్వాత 'బిగ్‌బాస్'ని ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుంది? అన్నదానిపై ఆయన మాట్లాడుతూ, ముందుగా ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్నాడు కాబట్టి ఆయనను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇది జనాలతో ఇంటరాక్ట్ అయ్యే షో.. నా అభిమాన హీరో అయిన పవన్‌కళ్యాణ్ ఇంకా బాగా చేయగలరని భావిస్తున్నాను.
ఒక వేళ అదే జరిగితే గోడ దూకైనా లోపలికి వెళ్లి రెండు రోజులు గడిపి వస్తానని ధన్‌రాజ్ అంటున్నాడు. షోని పవన్ హోస్ట్ చేయడం అనేది ఊహాజనితమైన విషయమే. ఇలా కేవలం ప్రజలను ఎంటర్‌టైన్ చేయడం పవన్ వల్ల కాదని అందరు ఒప్పుకుంటారు. ఇక బిగ్‌బాస్‌షో లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎన్టీఆర్‌ని నా అభిమాన నటుడు అని పొగిడిన ఈ ధనాధన్ ధన్‌రాజు ఇప్పుడు గేర్ మార్చి పవన్ నా అభిమాన హీరో అనడం బట్టి చూస్తే ధన్‌రాజ్ బిస్కెట్లు వేయడంలో ఆయనకు ఆయనే సాటి అని ఒప్పుకొని తీరాలి.