ప్రస్తుతం రామ్‌చరణ్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై 'రంగస్థలం 1985' అనే చిత్రం చేస్తున్నాడు. 1985 కాలం నాటి గ్రామీణ నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పల్లెలలో 1985 నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ దీనిని సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. సాధారణంగా రామ్‌చరణ్ అంటే ఆయనకు యూత్‌లో, మాస్‌లో, బి, సి సెంటర్లలో మంచి ఆదరణ ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఆయనకు లేడీస్ ఫాలోయింగ్ తక్కువ అని చాలా మంది వాదిస్తారు. కానీ దానిని నిజం కాదని నిరూపించే ఘటన తాజాగా జరిగింది.
రామ్‌చరణ్ ఉభయగోదావరి జిల్లాలలోని గ్రామాలలో ఈచిత్రం షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లాడు. దాంతో అక్కడి మహిళలు ఆనందంతో పొంగిపోయారు. తమదైన ఆట పాటలతో రామ్‌చరణ్ అండ్ టీంకి స్వాగతం పలికారు. తమ ఫోన్లలో రామ్‌చరణ్‌ని ఫొటోలు తీస్తూ ముచ్చటపడ్డారు. దాంతో రామ్‌చరణ్ కూడా వారిని తన ఫోన్లలో బంధించడమే కాదు.. ఏకంగా ఆ కోలాహలాన్నంతా వీడియో తీసి గోదావరి జిల్లాలలోని ప్రతి గ్రామంలో మాకు ఎలా స్వాగతం పలికారో చూడండి అంటూ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.