సినిమా నటుల్లో ఎక్కువ మంది రాజకీయంగా రాణించకపోవడం, ఒకసారి గెలిచిన వారు రెండోసారి గెలవలేకపోవడానికి వారు సినిమాలలో బిజీ బిజీగా ఉండి తమ నియోజకవర్గం సమస్యలను పట్టించుకోకపోవడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణం. ఇది ఒకేసారి రెండు పడవలపై పయనించడం వల్ల జరిగే నష్టం. ఇక తాజాగా ఎంతో కాలం తర్వాత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ లేపాక్షి నుంచి తన నియోజకవర్గంలో పర్యటించారు. దీంతో ఆ ప్రాంతంలో కనీసం రోడ్లులేక, వాన పడితే అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఉన్న కొందరు మండలంలోని గ్రామాలకు చెందిన వారు తమప్రాంతంలో సీసీ రోడ్డు వేయాలని కోరడం కోసం బాలయ్యని అడ్డుకుని తమ సమస్యలను విన్నవించారు. వీటిని విన్న బాలయ్య అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఆ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక బాలయ్య తన నియోజకవర్గంలో సాగుతుండగా, ఇలాంటి కనీస రోడ్లులేని వారు, పలు గ్రామాల ప్రజలు రోడ్డు లేక తాము పడుతున్న కష్టాలను బాలయ్యకు చెప్పాలని భావించారు. కానీ బాలయ్య అక్కడ ఆగకుండానే వెళ్లిపోయాడు.
దాంతో ఆయా గ్రామస్థులందరూ రాస్తారోకో చేస్తూ 'బాలయ్య డౌన్‌డౌన్... ప్రజల సమస్యలు పట్టని ఈ ఎమ్మెల్యే రాజీనామా చేయలంటూ' నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్‌కి అంతరాయం కలిగింది. వెంటనే పోలీసులు స్పందించి గ్రామస్థులకు సర్దిచెప్పి వారి చేత రాస్తారోకోను విరమింపజేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం గత ఎన్నికల్లో బాలయ్యను తిరుగులేని రీతిలో గెలిపించిన హిందూపురం నియోజకవర్గ ప్రజలు, తమ ఎమ్మెల్యే సినిమాలతో బిజీగా ఉంటూ తమ సమస్యలను పట్టించుకోకపోవడం, ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం, ఆయన అనుచరులు, పీఏలు ప్రజలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో బాలయ్య పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ వ్యతిరేక ప్రభావం బాలయ్య వచ్చే ఎన్నికల్లో కూడా హిందూపూర్ నుంచే పోటీ చేస్తే ఫలితాలు తారుమారైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు.