తన మొదటి చిత్రం 'రేయ్'తోనే సినిమా కష్టాలు ఎలా ఉంటాయో.. కొన్నిసార్లు ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ తన కెరీర్ ప్రారంభంలోనే అనుభవించి, అనుభవం గడించాడు. ఇక తన రెండో చిత్రం 'పిల్లా నువ్వులేని జీవితం' అనే రెండో చిత్రాన్ని మొదటి చిత్రంగా రిలీజ్ చేసి సక్సెస్‌ఫుల్ హీరో అనిపించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'సుప్రీమ్'తో ఏకంగా 25కోట్ల క్లబ్‌లో అతి తక్కువ చిత్రాలతోనే చోటు సంపాదించాడు. కానీ 'తిక్క, విన్నర్'లతో డిజాస్టర్స్ మూటగట్టుకున్నాడు. చివరకు ఎంతో శ్రమకోర్చి, పారితోషికం కూడా తీసుకోకుండా కేవలం వారం రోజుల షూటింగ్ అని, అతిధి పాత్ర అని కృష్ణవంశీని చూసి 'నక్షత్రం' చిత్రం ఒప్పుకున్నాడు. కృష్ణవంశీ పోలీస్ పాత్రలను ఎంతో పవర్‌ఫుల్‌గా చూపిస్తాడనే ఆశలో దాదాపు వారం రోజల నుండి నెలరోజులు పాటు ఆ పాత్ర కోసం కష్టపడ్డాడు.
ఇక సినిమాకి ఆర్దిక ఇబ్బందులు రావడంతో రెమ్యూనరేషన్ కూడా వద్దనుకున్నాడు. చివరకు 'నక్షత్రం' డిజాస్టర్‌గా నిలిచి, ఈ పరాజయం సాయి ఖాతాలో జమపడి హ్యాట్రిక్ ఫ్లాప్ హీరోగా ముద్ర వేయించుకున్నాడు. ఇక 'రేయ్' విడుదలైనా అదీ డిజాస్టరే. దాంతో తన కెరీర్ ప్రారంభంలోనే ఆటుపోట్లని చూసిన సాయిధరమ్‌తేజ్ ప్రస్తుతం తన కెరీర్‌ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరోవైపు తన మెగా కాంపౌండ్ వారి మాటల ప్రకారం కాకుండా దిల్‌రాజు గైడెన్స్ ప్రకారం ఆయన సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడని ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఆయన రైటర్ రవి దర్శకత్వంలో 'జవాన్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం సమర్పకునిగా దిల్‌రాజునే పెట్టుకుని, ఆయన చేత మార్కెటింగ్ చేయిస్తున్నాడు. దిల్‌రాజు సలహా ప్రకారం 'జవాన్' చిత్రంలోని కొన్ని సీన్స్‌ని రీషూట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మాస్, యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రం, తన చిన్నమామకు కెరీర్‌లో మొదటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన 'తొలిప్రేమ' కరుణాకరన్ దర్శకత్వంలో మరో చిత్రం ఒప్పుకున్నాడు.
ఈ రెండు చిత్రాల ప్రారంభోత్సవాలు కూడా జరిగాయి. ఇక కరుణాకరన్ చిత్రంలో ఆయన ఫ్యామిలీ, యూత్‌ని, వినాయక్ చిత్రంతో మాస్‌ని ఒకేసారి టార్గెట్ చేశాడు. వినాయక్ చిత్రంలో సాయి మొదటి సారిగా ద్విపాత్రాభినయం చేయనున్నాడని, ఈ చిత్రంలోని ఓ క్యారెక్టర్ గెటప్ మీసాలు పెంచి పైకి మెలేసి, 'కాటమరాయుడు'లోని తన చిన్నమామయ్య లుక్‌లో కనిపించనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.