ఇటీవలే హైవే మీద ఉన్న టోల్‌ప్లాజాలో టోల్ టిక్కెట్ తీసుకోమని అడిగినందుకు ఓ చోటా నాయకుని తనయుడు టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన సంగతి మరువక ముందే అనంతపురంలో ఇటువంటి సంఘటన మరోటి చోటుచేసుకుంది. అనంతపురం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుమారుడు రఘు తన స్నేహితులైన 14మందితో పట్టణంలో 'పైసా వసూల్' చిత్రం ఆడుతున్న శాంతి థియేటర్‌లో సెకండ్‌షో చూడటానికి వచ్చాడు. హడావుడిగా తమ ద్విచక్రవాహనాలను పార్క్ చేసి థియేటర్‌లోకి వెళ్లిపోయారు. సినిమా ముగించుకుని రాత్రి 12.30 ప్రాంతంలో థియేటర్ నుంచి బయటకు వచ్చి బైక్ స్టాండ్‌లో తమ వాహనాలను తీసుకోబోయారు.
ఇంతలో అక్కడి థియేటర్ సిబ్బంది పార్కింట్ టిక్కెట్లను అడిగారు. దానికి డిప్యూటీ మేయర్ తనయుడు రఘు, అతని స్నేహితులు... మమ్మల్నేం అనుకుంటున్నావ్... నేను డిప్యూటీ మేయర్ కొడుకుని, పార్కింగ్ టిక్కెట్ మేం కూడా తీసుకోవాలా? తీసుకోం.. నీ ఇష్టం ఎవరికైనా చెప్పుకో.. పార్కింట్ ఫీజు కట్టేదే లేదని థియేటర్ సిబ్బందితో గొడవకు దిగారు. కానీ సిబ్బంది మాత్రం మా యాజమాన్యం ఒప్పుకోదు.. పార్కింగ్‌ఫీజు కట్టాల్సిందేనని చెప్పారు. దీంతో రెచ్చిపోయిన డిప్యూటీ మేయర్ కుమారుడు రఘు, అతని స్నేహితుడు మూకుమ్మడిగా చేతులతో, చేతుల్లోని మోటారు బైక్ లాక్‌లతో సిబ్బంది మొహం మీద, మోచేతులు మీద మూకుమ్మడిగా దాడిచేశారు. దీంతో ఆ బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చివరకు నగర డిప్యూటీ మేయర్ తన కుమారుడి పరువు కాపాడాలని రంగంలోకి దిగి థియేటర్ యాజమాన్యంతో, బాధితులతో రాజీకి ప్రయత్నించినా వారు ససేమిరా అనడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బాలయ్యే అందరినీ కొడతాడనుకుంటే ఆయన అభిమానులు కూడా ఎవరినైనా కొడతారని ఈ సంఘటన రుజువు చేస్తోందని పలువురు సెటైర్లు వేస్తున్నారు.