ఆగస్ట్ 11 న జరిగిన యుద్ధం మరోసారి జరగబోతుంది. ఆగష్టు 11 న మూడు సినిమాలు లై, నేనేరాజు నేనే మంత్రి, జయ జానకి నాయక పోటీ పడ్డట్టే... ఇప్పుడు వచ్చే శుక్రవారం సెప్టెంబర్ 8 న కూడా మరో నాలుగు సినిమాలు యుద్దానికి సై అంటున్నాయి. నిన్నటిదాకా ఎవరుంటారో.. ఎవరు తప్పుకుంటారో అనుకున్నవారికి ముగ్గురు క్లారిటీ ఇచ్చినట్లేగాని... నాలుగోవాడే ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్సులోకి నెట్టేస్తున్నాడు. ఈ 8 న నాగ చైతన్య 'యుద్ధం శరణం'తో లావణ్య త్రిపాఠి తో కలిసి వస్తున్నాడు. ఈ మేరకు 'యుద్ధం శరణం' పబ్లిసిటీని వేగవంతం చేశారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు గట్రా ఇస్తూ హడావిడి చేసేస్తున్నాడు చైతూ. లావణ్య త్రిపాఠి హాట్ లుక్స్ తో కనబడనున్న ఈ మూవీలో శ్రీకాంత్ విలన్.
ఇక రెండో వాడు అల్లరి నరేష్. నరేష్ కూడా 'మేడ మీద అబ్బాయి' అంటూ అల్లరితో కామెడీ చెయ్యడానికి సిద్ధమయ్యాడు. అల్లరి నరేష్ కూడా తన సినిమా పబ్లిసిటీని షురూ చేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ హడావిడి మొదలెట్టాడు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ తో జోడి కడుతున్న భామ నిఖిల విమల్. ఇకపోతే మూడోవాడు బాలీవుడ్ నటుడు సచిన్ జోషి కూడా 'వీడెవడు' తో తెలుగు హీరోల మీద యుద్దానికి సై అన్నాడు. నిన్నమొన్నటివరకు సైలెంట్ గా కూర్చుని ఉన్నట్టుండి 'బిగ్ బాస్' అనే తెలుగు రియాలిటీ షోలో తన సినిమా ప్రమోషన్ కి శ్రీకారం చుట్టేశాడు. ఈ ముగ్గురు పక్కాగా సెప్టెంబర్ 8 కే స్ట్రాంగ్ గా ఫిక్స్ అవడమూ... పబ్లిసిటీని పీక్ కి తీసుకెళ్ళడమూ బాగానే ఉన్నాయి.
కానీ నాలుగోవాడు మంచు మనోజ్ మాత్రం తన 'ఒక్కడు మిగిలాడు' చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 8 నే విడుదల అన్నాడు. కానీ ఎటువంటి కన్ఫర్మెషన్ లేకుండా... ఇప్పటికి సినిమాకి సంబందించిన ప్రమోషన్ ని మొదలెట్టకుండా సైలెంట్ గానే ఉంటున్నాడు. అసలు మనోజ్ రాక ఉన్నట్టా.. లేనట్లా అనేది క్లారిటీ రావడం లేదు. మరి మంచు మనోజ్ తప్పుకున్నాడో.. లేదో తెలియదు గాని ఈ ముగ్గురు హీరోలు నాగ చైతన్య, అల్లరి నరేష్, సచిన్ జోషీలు మాత్రం ఏమాత్రం తగ్గకుండా బలాబలాలు చూపించేందుకు గట్టి ప్రయత్నాలు ప్రారంభించేశారు.