భారతదేశంలోని ప్రజలకు ఓపిక ఎక్కువ. ఎవరిమీదనైనా నమ్మకం పెట్టుకుంటే.. ఈ రోజు చేయకపోయినా రేపటికైనా చేస్తారులే అని ఆశావాదంతో వారు ఎదురుచూస్తూ ఉంటారు. మోదీ నల్లదనం వెలికితీత, విదేశాలలో నల్లధనం దాచుకున్న అవినీతి కుబేరులు, దేశంలో అవినీతి నిర్మూలన ఇంకా ఇంకా జరుగుతుందని, ఈరోజు కాకపోతే రేపయినా మోదీ దేశాన్ని బాగుచేస్తాడని ప్రజలు భావించి, ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో మోదీకే పట్టం కట్టారు. ఇంకా ఆయన ఏమీ చేయకపోయినా కేవలం ఐదేళ్లలో ఎవరు మాత్రం అల్లా వుద్దీన్ అద్భుతదీపంగా మార్చరు కదా...! వచ్చే ఎన్నికల్లో కూడా మోదీనే గెలిపిద్దాం... అంటూ పెద్ద నోట్ల రద్దు నుంచి పలు విషయాలలో తమకు భారమైన నిర్ణయాలను మోదీ తీసుకుంటూన్నా ఆయనపై నమ్మకంతోనే ఉన్నారు.
రాష్ట్రంలో ఇదే విషయం చంద్రబాబుకి కూడా వర్తిస్తుంది. పాపం.. విభజన కష్టాల వల్ల బాబు పెద్దగా ఏమీ చేయలేకపోతున్నారని, కేంద్రం సహకరిస్తే ఆయన్ను మించి ఎవ్వరూ అభివృద్ది చేయలేరని భావిస్తూ నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ ఎన్నికలలో ఆయనకే పట్టం కట్టారు. ఇక కిందటి ఎన్నికల్లో బాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని బాబు చేసిన వాగ్దానం ఇప్పటికీ నెరవేరలేదు. ఎంతసేపటికి తనకు అనుకూలమైన మీడియా ద్వారా ఇన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. ఇంకా వేల విదేశీ సంస్థలు వస్తున్నాయి. దీనివల్ల ప్రత్యక్షంగా ఇంత మందికి, పరోక్షంగా ఇంతమందికి ఉపాధి లభిస్తుందనే అంకెల గారడీ తప్ప ఇప్పటివరకు ఎవ్వరికీ కొత్తగా ఉపాధి, ఉద్యోగాలు వచ్చిన స్థితిలేదు.
ఇక తాజాగా చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ సంస్థలకు చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమై పాడిందే పాడరా.. పాచిపళ్ల దాసుడా అనే స్థితి ఏర్పడింది. ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో, అమరావతిలో ఎన్నో వనరులు పుష్కళంగా ఉన్నాయని, వాటిని వినియోగించుకునేందుకు విదేశీ సంస్థలు ఇక్కడ ఉత్పత్తి, ఆహారశుద్ది, ఐటీ, విద్య, వైద్యం, పర్యాటకం, అక్వా రంగాలలోని అవకాశాలను విదేశీ ప్రతినిది బృందాలకు ఉండవల్లిలోని తన స్వగృహంలో, తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో ఏకరువు పెట్టారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి సులభరతమైన అనుమతులు, భూములను కూడా సిద్దంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
జపాన్‌కి చెందిన టయోటా కిర్లోస్కర్ కంపెనీ ప్రతినిధులతో, అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఇండో అమెరకిన్ వ్యాపార, వాణిజ్య బృందాలతో ఆయన సమావేశమై ఈ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ఈ సందర్భంగా అమెరికాకి చెందిన ఇండో అమెరికన్ బృందం రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు మరలా ఐటీ మంత్రి లోకేష్‌తో కలసి చంద్రబాబు మరోసారి ఫ్లోరియాలో పర్యటించాల్సిందిగా ఆ ప్రతినిధి బృందం చంద్రబాబుకు ఆహ్వానం పలికింది. ఇలా ఆయన ఐదేళ్ల కాలం పర్యటనలు, ఆహ్వానాలతోనే గడిచిపోయి, పుణ్యకాలం ముగిసిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.