పవన్ పుట్టినరోజు హంగామా అయ్యింది. సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజున పవన్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్ర కాన్సెప్ట్ పోస్టర్, మ్యూజికల్ సర్ప్రైజ్ అంటూ హడావిడి చేసి అభిమానులలో జోష్ నింపారు. వాటితోనే సరిపెట్టకుండా పవన్ కళ్యాణ్ తో పాటే హీరోయిన్ కీర్తి సురేష్ కలిసున్న లుక్ ని కూడా వదిలి అభిమానులను పిచ్చ ఆనందానికి గురి చేశారు. మరి ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ఒకరు కీర్తి సురేష్ కాగా మరొకరు అను ఇమ్మాన్యువల్. అలాగే ఖుష్బూ, ఇంద్రజలు కూడా ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర హీరో హీరోయిన్ ల లుక్ ని నటి కీర్తి సురేష్ విడుదల చేసింది. ఆ ఫోటో లో పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్ ని కొంటె చూపుతో చూస్తుండగా.. కీర్తి మాత్రం చిన్న గా నవ్వుతూ పుస్తకం చదువుకుంటుంది. అయితే ఇలాంటి సీన్ ఎక్కడో ఎప్పుడో చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ 'ఖుషి' సినిమాలో భూమిక పుస్తకం చదువుతుండగా... పవన్, భూమికను దొంగచాటుగా చూసే సీన్ గుర్తొచ్చేస్తుంది. అయినా పవన్ అభిమానులు మాత్రం అది 'ఖుషీ'లో సీనా... లేదా మరేదైనా అవ్వనివ్వండి... మా అభిమాన హీరో పవన్ అలా హీరోయిన్ కీర్తి సురేష్ ని చూస్తుంటే ఎంతో కలర్ ఫుల్ గా ఉందంటున్నారు.
ఇక కీర్తి సురేష్ ఎప్పటిలాగే ఈ చిత్రంలో కూడా చాలా ట్రెడిషనల్ గా, చాలా పద్దతిగా కనబడుతుంది. మరి సినిమా మొత్తం అలాగే ఉంటుందా.. లేకుంటే త్రివిక్రమ్ తన సినిమాల్లో హీరోయిన్స్ ని కాస్త గ్లామర్ గా చూపించినట్టుగా కీర్తి కూడా గ్లామర్ గా కనిపిస్తుందా అనేది మాత్రం జనవరి 10 2018 నే తెలుస్తుంది.