గత శుక్రవారం ఆగష్టు 25 న విడుదలైన 'అర్జున్ రెడ్డి' చిత్రం కలెక్షన్స్ పరంగానే కాదు... కాంట్రవర్సీ పరంగాను గొప్పగా హైలెట్ అయ్యింది. తక్కువ బడ్జెట్ సినిమాగా తెరకెక్కడమే కాకుండా సినిమాకి ముందే కావాల్సినంత నెగెటివ్ పబ్లిసిటీని మూటగట్టుకుని థియేటర్స్ లోకి దిగింది. విడుదలకు ముందు.. తర్వాత కూడా అర్జున్ రెడ్డి పై విమర్శలు, ప్రతివిమర్శలు వినబడుతూనే ఉన్నాయి. ఇక అందులో నటించిన హీరో విజయ్ అయితే రాత్రికి రాత్రే తెలంగాణాకి మెగాస్టార్ అన్నట్టు అవతారమెత్తాడు. ఈ సినిమా విడుదలై వారమవుతున్నా వసూళ్లు తగ్గలేదంటున్నారు.
'పైసా వసూల్' తో 'అర్జున్ రెడ్డి' కలెక్షన్స్ కొద్దిగా తగ్గినా... ఇప్పటికే లాభాల బాటలో ఉన్న నిర్మాతలకు పెద్ద నష్టం ఉండదు. అయినా 'అర్జున్ రెడ్డి' కాంట్రవర్సీ కొనసాగుతూనే వుంది... అలాగే సినిమాకి ఫుల్ పబ్లిసిటీ కూడా ఫ్రీగా వచ్చేస్తూనే వుంది. అయితే ఇప్పుడు తెలుగు 'అర్జున్ రెడ్డి'ని కోలీవుడ్ హీరో ఒకరు ఎగరేసుకుపోయారట. ఈ సినిమా ఇప్పుడు అన్ని భాషల హీరోలను తెగ ఆకర్షిస్తుంది. అందులో భాగంగానే కోలీవుడ్ లో శింబు, ధనుష్ వంటి హీరోలు ఈ సినిమా ని రీమేక్ చెయ్యడానికి తమిళ హక్కుల కోసం తెలుగు నిర్మాతల వద్ద పోటీ పడ్డారట.
అయితే ఫైనల్ గా 'అర్జున్ రెడ్డి' తమిళ హక్కులను ధనుష్ ఆద్వర్యంలోని వండర్ బార్ ఫిలిమ్స్ 80 లక్షలకు దక్కించుకుందట. మరి ఇప్పటికే విపరీతమైన లాభాలతో ఉన్న నిర్మాతలకు ఈ తమిళ హక్కులు అమ్మడవడంతో మరిన్ని లాభాలు జేబులో వేసుకున్నట్లే. ఇకపోతే యూత్ కి నచ్చే ఈ చిత్రాన్ని ధనుష్ హీరోగా చేస్తాడో లేకుంటే తన వండర్ బార్ ఫిలిమ్స్ నిర్మాణంలో మరో హీరోతో ఈ సినిమాని నిర్మిస్తాడో అనేది క్లారిటీ రావాల్సి వుంది.