వేదాంత ధోరణి ఉన్నా పాయింట్ సరిగానే చెప్పాడు.. కానీ దానిని అభిమానులు అర్ధం చేసుకుంటారా...?
పవన్ ఏది మాట్లాడినా ఓ వేధాంత ధోరణిలో ఉంటుంది. ఆయన చేసే స్పీచ్‌లు, ఆయన అభిమానులకు చెప్పే సూక్తులు, ఆయన పవనిజం వంటివి చాలా మందికి అర్ధం కాక గజిబిజీగా ఉండవచ్చు. చివరకు ఆయన అభిమానులకు కూడా ఆయన చేసే కొన్ని ప్రసంగాలు అర్ధం కావు. కానీ తమ అభిమాన హీరో కాబట్టి కేరింతలు కొడతారు. ఇక తాజాగా ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ పవన్‌పై చేసిన కామెంట్లకు పవన్ పరోక్షంగా స్పందించి కౌంటర్ వేశాడు. కానీ ఈ కౌంటర్ ఎంత మంది బుర్రలకు అర్ధమవుతుందనేది పక్క విషయం.
ఇక ఇంతకాలం నేను సినిమా హీరోని కాబట్టి విలన్లను చితక్కొడతాను. అది సినిమా కాబట్టి మనల్ని ఎవ్వరూ ఎదురు ప్రశ్నించేవారు ఉండరు. కానీ రాజకీయం అలా కాదు. నన్ను షబ్బీర్ అలీగారు తిడతారు. దానం నాగేందర్ గారు తిడతారు. మరలా మేమందరం కలిసినప్పుడు మాట్లాడుకుంటాం. అది సినిమా కాబట్టి రెండున్నర గంటల్లో అయిపోతుంది. కానీ ఇది రాజకీయం. కాబట్టి సినిమాలోలాగా జరగదు అంటూనే తన అభిమానులకు సినిమాలకి, రాజకీయాలకు మధ్య ఉన్న తేడాను విడమర్చి చెప్పే ప్రయత్నం చేశాడు.
ఇక ఎదుటి వారు విమర్శించినప్పుడు మనం సంయమనం వహించాలి. మరీ ప్రాణాల మీదకు వచ్చే సహనం అయితే అవసరం లేదు. మనం ఎవ్వరిమీదా దాడిచేయం. ఎవరైనా దాడి చేస్తే చేతులు అడ్డుపెట్టుకుందాం.. అని తన ఫ్యాన్స్‌కి హిత బోధ చేశాడు. ఎవరికైనా ఒక బలమైన గొంతు, వాదన ఉన్నప్పుడు కొందరు ఎందుకో బాగా ఇరిటేట్ అవుతారు. వాళ్లని మనం ఏమీ చేయకపోయినా, ఏమీ అనకపోయినా వారు అలాగే రియాక్ట్ అవుతారు. నేను సినిమాలలోకి వచ్చినప్పుడు కొందరు విమర్శించారు. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి జరుగుతాయని నాకు తెలుసు. నేనేమీ బంగారాన్ని కాదు.. అందరికీ నచ్చడానికి, నేను మనిషినే.
కాబట్టి కొందరు నన్ను వ్యతిరేకించవచ్చు. నాలో నచ్చని విషయాలు కొన్ని ఉండవచ్చు. కాబట్టి ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నీ టైం వేస్టింగ్. వాళ్ల సమయమే వృథా అవుతుంది. మనిషి నవ్వినప్పుడు కేవలం కొన్ని కండరాలే పనిచేస్తాయట. అదే ద్వేషించేటప్పుడు శరీరం అంతా రక్తం కలుషితం అయిపోతుంది. మొత్తంగా వారి ముఖ కండరాలే పాడైపోతాయి. మొత్తంగా వారికే నష్టం. అందుకే నేను ఎవ్వరినీ ద్వేషించను. మీరు కూడా నాలాగే ఉండండి అని పలు విషయాలలో తనపై విమర్శలు చేసేవారి స్థాయిని, ఇంటెన్సిటీని చూడమని, తాను రాజకీయాలలో విమర్శలు ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నానని చేసిన స్పీచ్ ఆయన పరిపక్వతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.