దేశవ్యాప్తంగా జరిగే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని సినీ ప్రముఖులు కూడా తమ ఇళ్లలో గణేషుని విగ్రహాలను నెలకొల్పి పూజలు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రసాయనాలు ఉండే బొమ్మల కంటే మట్టితో చేసిన గణపతులనే పూజించాలని అందరినీ కోరారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌లు కూడా మట్టి వినాయకుని విగ్రహాలను తమ ఇళ్లల్లో ప్రతిష్టించారు.
ఈ సందర్భంగా తీసిన ఫోటోని రామ్‌చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన భార్య ఉపాసన కొణిదెలతో కలిసి ఆయన వినాయకుని ప్రతిమతో కలిసి తీయించుకున్న ఫొటోని షేర్ చేస్తూ.. వీడ్కోలు గణేశా....! అందరి కలలు నెరవేరేలా దీవించు. మరీ ముఖ్యంగా స్వచ్చమైన మనసుతో సంతోషాన్ని పంచాలనుకునే వారి కలలను నిజం చేయి.. అంటూ తాము వినాయకుని ప్రతిమను నిమజ్జనం చేసినట్లు పేర్కొన్నాడు.
ఇక తన భార్య ఉపాసనతో దిగిన ఈ ఫొటోలో రామ్‌చరణ్ కాషాయం రంగు టీషర్ట్, నల్లని పంచె కట్టుకుని ఉన్నాడు. ఇప్పటివరకు ఆయన తాజాగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న 'రంగస్థలం 1985'కి సంబంధించిన ఆయన లుక్‌లు బయటకు వస్తున్నా కూడా చాలా క్లియర్‌గా ఈ చిత్రంలోని రామ్‌చరణ్ లుక్‌ని ఈ ఫోటోలో చూడవచ్చు. దీంతో మెగాభిమానులు ఎంతో ఆనందంగా ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు.
మరి వినాయకుని దీవెనలతో ఆయన హీరోగా 'రంగస్థలం 1985', నిర్మాతగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో నిర్మిస్తున్న 'సై...రా.. నరసింహారెడ్డి'లు విజయవంతం అవుతాయని మెగాభిమానులు ఘంటాపథంగా చెబుతున్నారు.