సూపర్‌స్టార్ కృష్ణ నాడు కాంగ్రెస్ తరపున ఏలూరులో ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో ఆయన అధికారాన్ని, ఇతర శక్తులను చూసి కూడా భయపడకుండా ప్రచారం చేశాడు. నాడు ఓ ఎన్టీఆర్ అభిమాని విసిరిన రాయి వల్ల ఆయన కన్నుకు బాగా గాయమైంది. ఇక ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణ తన 'సాహసమే నా ఊపిరి, మండలాదీశుడు' చిత్రాల ద్వారా ఎన్టీఆర్‌ని వ్యంగ్యాస్త్రాలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఇక రాజీవ్‌గాంధీ బతికుంటే కృష్ణ సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు. ఆయన రాజకీయాల వల్ల ఆర్ధికంగానే కాకుండా చాలా మంది అభిమానులను కూడా కోల్పోయాడు.
దాంతో ప్రస్తుతం మహేష్‌బాబు రాజకీయంగా తటస్థంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చాడు. కిందటి ఎన్నికల్లో తనకెంతో ఇష్టమైన బావ గల్లా జయదేవ్‌ని గుంటూరు ఎంపీగా గెలిపించమని తన ఫ్యాన్స్‌కి చెప్పాడే గానీ ఎక్కడా పూర్తిగా తన మద్దతు టిడిపికే అని చెప్పలేదు. తన మద్దతు కేవలం తన బావకేనని స్పష్టం చేశాడు. ఇక ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి విజయం సాధించింది. ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా మహేష్ బాబాయ్, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు మహేష్ అభిమానులు వైసీపీకి ఓటు వేయాలని అడిగాడు.
తాజాగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ, మహేష్‌కి అన్ని పార్టీలలోనూ అభిమానులున్నారు. ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవిలలాగా మహేష్‌కి కూడా అన్ని పార్టీలు, నాయకులతో సంబంధాలు, అభిమానులు ఉన్నారు. గత ఎన్నికల్లో నాకు, నా తల్లికి మహేష్ అభిమానులు బాగా మద్దతు ఇచ్చి గెలిపించారు. రాష్ట్రాభివృద్ది, నీతి, నిజాయితీ, గుడ్‌గవర్నెస్, మంచి పరిపాలనాదక్షత ఉండాలని భావిస్తే చంద్రబాబుని సీఎంని చేయండి. ఈ మంచి సంగతులు నెరవేరాలంటే మహేష్ ఫ్యాన్స్ టిడిపికి సపోర్ట్ చేయాలి. కాకినాడ ఎన్నికల్లో కూడ మహేష్ ఫ్యాన్స్ టిడిపికి మద్దతు పలకాలని కోరుకుంటూ ఉన్నాను.. అని చెప్పాడు.
రాజకీయాలు నాకు వద్దు. కేవలం తన బావ గల్లా జయదేవ్ విషయంలో మాత్రం ఆయనకు ఓటేయండి అని మహేష్ చెబుతుంటే గల్లా జయదేవ్, ఆదిశేషగిరిరావుల వల్ల మహేష్‌కి కూడా రాజకీయ బురద అంటుకునేలా ఉంది..!