నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'పైసావసూల్'. బాలయ్య నటిస్తున్న ఈ 101వ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనూప్‌రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాలయ్య మొదటిసారిగా ఓ పూర్తి పాటను పాడాడు. అది కూడా మద్యంపై పాట. 'మామా.. ఏక్ పెగ్‌లా' అనే ఈ పాటను బాలయ్య మంచి ఎనర్జీతోనే పాడాడు. ఇక ఈచిత్రం ఆడియో విజయోత్సవ సభకు మోహన్‌బాబు కూడా వచ్చాడు.
ఆయన మాట్లాడుతూ, 'మామా ఏక్ పెగ్‌లా' అనే పాటను బాలకృష్ణ ఎవరి కోసం పాడాడు? ఏ మామని పెగ్ తెమ్మన్నాడో తనకు తెలియలేదన్నాడు. ఇక చంద్రబాబునాయుడుకి మద్యం తాగే అలవాటు లేదని, మరి ఆ పెగ్ తెచ్చే మావ ఎవరో అన్నది తనకు ఆసక్తికరంగా మారిందంటున్నాడు. అయినా ఇక్కడ బాలయ్యకు కూడా మద్యం అలవాటులేదని మోహన్‌బాబు చెప్తే భలే ఉండేది. అయినా మందు తాగినోడికి అందరూ మామలుగా, బావలుగా కనిపిస్తారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పలువురు తాగేటప్పుడు తమ పక్కవారిని 'ఇంకా కావాలా మావా..! ఏం బావా ఎలాగున్నావు.. ఓ చుక్కేస్తేవా..' అనేవి ఊతపదాలుగా వాడుతారు. ఇంకా మోహన్‌బాబు మాట్లాడుతూ, ఈ చిత్రంలో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌లాగా డ్యాన్స్ చేశాడని, ఆ పాట చూసి బాగాలేకపోతే మొహమాటం లేకుండా ఫోన్ చేసి బాలయ్యకే చెప్పేస్తాను.. అని చెప్పాడు. అయినా అన్నం ఉడికిందా? లేదా? అనేది ఓ మెతుకు పట్టుకుంటేనే తెలిసిపోతుంది.
మరి ఈ సాంగ్ ప్రోమో చూసిన తర్వాత కూడా బాలయ్య ఎన్టీఆర్‌లా ఎలా డ్యాన్స్ చేశాడో? ఓ నిర్ణయానికి మోహన్‌బాబు రాకపోవడం ఆశ్చర్యమే. ఈ పాటలో ఎన్టీఆర్‌లా స్టెప్స్ వేసిన తమ అభిమాన నటుడు డ్యాన్స్ ఎలా ఉందని అడిగితే పక్కా నందమూరి అభిమాని కూడా అది ఆ పెద్దాయనకే సాధ్యం అనే ఖచ్చితంగా చెప్పేస్తారు. దీని కోసం సినిమా విడుదలయ్యే దాకా ఎదురు చూడటం ఎందుకు కలెక్షన్ కింగూ...!