ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్న జంటలు ఎక్కువయినట్టే.. విడాకుల పిటిషన్ వేసి మళ్ళీ పిల్లలకోసం కాంప్రమైజ్ అవుతూ ఆ విడాకులు వద్దంటూ మళ్ళీ కోర్టుకెక్కే జంటలు ఎక్కువయ్యాయి. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ రంభ వంటి నటీమణులు భర్తతో విడాకుల కోసం ప్రయత్నించి మరీ.. మళ్ళీ పిల్లలకోసమే ఆ విడాకులు వద్దంటూ కోర్టుకెక్కి కలిసి జీవిస్తున్నారు. ఇప్పుడు ఆ తరహాలోనే మరో జంట కూడా తమకు విడాకులు వద్దంటూ కోర్టుని ఆశ్రయించింది. తెలుగులో 'ఈగ' వంటి సినిమాతో మంచి పేరు సంపాదించిన 'కిచ్చ' సుదీప్ తన భార్యతో విడాకులు కావాలని 2015లో బెంగుళూర్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశాడు.
పిటిషన్ అయితే వేశాడు. కానీ కోర్టుకి హాజరుకాకుండా సుదీప్ భార్య ప్రియా, సుదీప్ కూడా కోర్టు ఇచ్చిన వాయిదాలకు హాజరుకాలేదు. మరి కోర్టు ఇచ్చిన వాయిదాలకు హాజరుకాకుండా కోర్టు సమయాన్ని వృధా చెయ్యడంతో చివరకు సుదీప్ ని కోర్టు చివరిసారిగా మీరు మీ భార్య నుండి ఎందుకు విడాకులు పొందాలనుకుంటున్నారో చెప్పాలని గట్టిగా అడగడంతో, దానికి సుదీప్ తన కుమార్తె శాన్వి జీవితం కోసం భార్యతో జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.
ఇక ఒక్క సుదీప్ మాత్రమే ఇలాంటి సమాధానం చెప్పలేదు... అతని భార్య ప్రియా కూడా అదే సమాధానం చెప్పి మరీ.... తమ పిటిషన్ ని వెనక్కి తీసుకున్నారు. దీంతో కోర్టు కూడా సుదీప్, ప్రియల వివరణకు సంతృప్తి చెంది... వారి విడాకుల వ్యవహారం కొట్టేసిందంటున్నారు. దీంతో సుదీప్ విడాకుల కథ కూతురు శాన్వి సంతోషం కోసం సుఖాంతం చేశారన్నమాట.