తమ తండ్రులు నటించిన చిత్రాలను రీమేక్ చేయడం, సీక్వెల్స్‌ను వారి వారసులు చేయడం మామూలే. ఇక పాటలనైతే బాగా రీమిక్స్ చేస్తారు. చిరంజీవి పాటలను ఆయన మేగామేనల్లుడు తెగ వాడేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక పూరీ జగన్నాథ్ 'పోకిరి' చిత్రంలో తన తండ్రి కృష్ణ నటించిన 'గల గల పారుతున్న...' పాటను రీమిక్స్ చేశాడు. కానీ రీమిక్స్ అనే భావన రాకుండా ఓ ఫ్రెష్ సాంగ్‌గా దానికి టచ్ ఇచ్చాడు. ఇక ఆ పాటలోని కృష్ణ స్టెప్స్‌ని గానీ, ఆయన ధరించిన డ్రస్‌ల వంటివి మాత్రం వాడలేదు. ఈ పాట చిత్రంలో పెద్ద హిట్ అయింది.
ఇక ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తన తాజా చిత్రం.. బాలయ్య 101గా చేస్తున్న మూవీ 'పైసా వసూల్'. సెప్టెంబర్ 1న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం స్టంపర్, టీజర్, ట్రైలర్లకు, పాటలకు మంచి హైప్ వచ్చింది. ఇక ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న అనూప్ రూబెన్స్, పూరీ, బాలయ్యల ఆజ్ఞను శిరసావహిస్తూ, బాలయ్య తండ్రి ఎన్టీఆర్-వాణిశ్రీలు కలిసి నటించిన 'జీవిత చక్రం'లోని 'కొంటెనవ్వు చెబుతోంది' పాటను రీమిక్స్ చేశాడు.
ఈ పాట నాడు పెద్దహిట్. మరి బాలయ్య ఈ ప్రయోగాన్ని చేస్తుండటం, ఇటీవలే విడుదలైన సాంగ్ ప్రోమో కూడా బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ పాటలో నాటి ఎన్టీఆర్ ధరించిన కాస్టూమ్స్ నుంచి, ఎన్టీఆర్ తరహా అభినయాన్ని బాలయ్య బాగా పోషించాడనే ప్రశంసలతో పాటు కొన్నిచోట్ల బాలయ్య మూమెంట్స్ చూస్తే ఏదో ఎబ్బెట్టుగా ఉందని, ఎన్టీఆర్‌ని చులకన చేసే విధంగా బాలయ్య హావభావాలున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
పాటను రీమిక్స్ చేస్తే ఫర్వాలేదు. డ్యాన్స్‌లు, కాస్టూమ్స్‌ని కూడా రీమిక్స్ చేయాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. ఈ పాటలో బాలయ్యతో పాటు ముస్కాన్ సేధీ కూడా కనిపించనుండటం విశేషంగా చెప్పుకోవాలి. మరి పూర్తిగా ఆడియన్స్ ఫీలింగ్స్ చూడాలంటే సెప్టెంబర్1న ఈ చిత్రం విడుదలయ్యేవరకు వేచిచూడాల్సివుంది...!