సాధారణంగా పలు చిత్రాలలో హీరోలు వేరే హీరోలపై..వారి చిత్రాలపై సెటైర్లు వేస్తుంటారు. శ్రీనువైట్ల తీసిన పలు చిత్రాలలో ఇతర హీరోలని, వారి డైలాగ్‌లని, టెక్నీషియన్స్ మీద ప్రతి చిత్రంలో పంచ్‌లు వేసేవాడు. అది ఓవర్‌గా మారి 'ఆగడు' చిత్రంలో ఎదురు దెబ్బ తగిలింది. అల్లరి నరేష్, 30ఇయర్స్ పృధ్వీ వంటి వారి చేత వేయించే పేరడీలను మించిపోవడంతో ఈ చిత్రం బెడిసికొట్టింది. ఇక నాడు కృష్ణ, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసిన పలు వ్యంగ్య చిత్రాలు, దాసరి తీసిన పలు పొలిటికల్ సెటైర్ చిత్రాలు, ఇలా చాలా సినిమాలలో, బాలకృష్ణ, నందమూరి వంశం హీరోలు చెప్పే స్వర్గీయ ఎన్టీఆర్‌ని ప్రతిబింబించే డైలాగులు, తొడ కొట్టడాలు చాలా పేరడీలుగా మారాయి.
సినిమా ప్రారంభంలో ఇవి ఎవ్వరినీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావు.. కేవలం కల్పితం అని వేయడం కూడా మామూలే. కాగా పూరీ జగన్నాథ్ దర్శకునిగా చిరంజీవి హీరోగా నాడు మరో మెగాబ్రదర్ నాగబాబు ఓ చిత్రం చేయాలని భావించాడు. కానీ అది పట్టాలెక్కలేదు. ఇక చిరంజీవి 150 వ చిత్రం, పదేళ్ల తర్వాత ఆయన గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చే చిత్రానికి దర్శకుడు పూరీనే అని వార్తలు వచ్చాయి. పూరీ తయారు చేసిన 'ఆటోజానీ' కథ చిరంజీవికి మొదటి భాగం బాగా నచ్చింది. రెండో భాగం నచ్చకపోవడంతో చిరంజీవి పూరీకి నో అనేశాడు. సెకండాఫ్ తనకు నచ్చలేదని చిరు మీడియా ముందే చెప్పాడు. అదేదో తనకు చెబితే దానిని మారుస్తాను గానీ మీడియాకు చెబితే బాగా లేని సెకండాఫ్ బాగా వచ్చేస్తుందా? అని కూడా పూరీ వాపోయాడు.
ఇక ఇప్పుడు ఆయన బాలకృష్ణ 101 వ చిత్రంగా ఆయనతో 'పైసా వసూల్' చిత్రం చేస్తున్నాడు. ఇందులో మెగాస్టార్‌పై కొన్ని సెటైర్స్ ఉంటాయని, అలీ పాత్ర ద్వారా ఈ సెటైర్లు ఉంటాయని అంటున్నారు. అయితే చిరంజీవిని ఇప్పుడు 150వ చిత్రంతో కాకపోయిన మరో నెంబర్ చిత్రమైనా తన దర్శకత్వంలో ఉంటుందని పూరీ స్వయంగా ఎంతో పాజిటివ్‌గా చెప్పాడు. దాంతో పూరీ నైజం సెటైర్లు వేసే విధం కాదని మరికొందరు వాదిస్తున్నారు. మరి ఈ చిత్రం సెప్టెంబర్1న విడుదలైతే కానీ ఏ విషయం తెలియదు...!