ఎన్టీఆర్ రెండు పడవల మీద కాళ్ళేసి స్వారీ చేస్తున్నాడు. ఒక పక్క 'జై లవ కుశ' షూటింగ్. మరో పక్క బుల్లితెర మీద 'బిగ్ బాస్'. 'జై లవ కుశ' విడుదల డేట్ దగ్గర పడుతుంది కానీ సినిమా షూటింగ్ లో ఇంకా మూడు పాటల షూటింగ్ మిగిలే వుంది. అలాగే సినిమా విడుదలకు కేవలం ఇంకా ఒక్క నెల మాత్రమే మిగిలి ఉండడంతో ఈ సినిమాపై అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు సినిమాకి సంబందించిన షూటింగ్ కూడా పూర్తి కాలేదు మరి సినిమాని ఒక్క నెలలో ఎలా థియేటర్స్ లోకి దించుతారు అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ 'జై లవ కుశ'ని ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 21 నే విడుదల చేస్తామని ఢంకా బజాయిస్తున్నాడు చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్.
కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చినట్టే ఎన్టీఆర్ కూడా సినిమా విడుదల విషయంలో ఏ మాత్రం తగ్గడంలేదు. 'లవ' టీజర్ ని ఆగష్టు 25 న వినాయకచవితి సందర్భంగా విడుదల చేస్తున్న చిత్ర టీమ్ మిగతా 'కుశ' పాత్ర ఫస్ట్ లుక్ ని, టీజర్ ని ఈ నెలాఖరులోగా విడుదల చేసే ప్లాన్ లో ఉంది. అలాగే ఆడియో వేడుకని సెప్టెంబర్ మొదటి వారంలో జరపాలనే యోచనలో ఉన్న చిత్ర యూనిట్ కి ఎన్టీఆర్ పూర్తి సహకారమే అందిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో లేట్ అవకుండా తన మూడు పాత్రల డబ్బింగ్ ని పూర్తి చెయ్యడానికి రెడీ అయ్యాడు. అందులో భాగంగానే ఈ మంగళవారమే 'జై లవ కుశ' డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నాడు ఎన్టీఆర్.
ఇక పాటల చిత్రీకరణ కూడా త్వరలోనే స్టార్ట్ చేసి కంప్లీట్ చెయ్యాలనే ఆలోచనలో డైరెక్టర్ బాబీ కూడా ఉన్నాడట. అయితే 'జై లవ కుశ' విడుదలకి చాల దగ్గర డెడ్ లైన్ పెట్టడం వలన డైరెక్టర్ బాబీ చాలా ఒత్తిడిలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇకపోతే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేత థామస్ లు నటిస్తుండగా... దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 21 న విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.