తరచుగా వివాదాలలో ఉండే దర్శకుడు తేజ తాను డబ్బుతో ఏమైనా సాధించవచ్చని చెప్పేవాడు. ఈ విషయం ఒకప్పటి తేజని ఎరిగిన వారిని అడిగితే తెలుస్తుంది. కానీ తన జీవితంలో జరిగిన దుర్ఘటన మూలంగానైనా ఆయన డబ్బుతో అన్ని సాధించలేం అని తెలుసుకున్నాడా? లేదా? అనేది ఆయనకే వదిలేయాలి. తేజ చిన్నకుమారుడు ఔరవ్ నాలుగేళ్ల వయసులోనే చనిపోయాడు. ఆ పిల్లవాడి వ్యాధికి చికిత్సకు తేజ దంపతులు ఎన్నోదేశాలు తిరిగారు. కానీ ఎవ్వరూ, ఏ డబ్బు ఆయన పిల్లాడిని కాపాడలేకపోయింది.
దాదాపు 2008-12 వరకు దర్శకత్వంతో పాటు అన్ని వదిలేసిన తేజా కేవలం తన కుమారుడిని బతికించుకునేందుకు ఎంతో తాపత్రయపడ్డాడు. కానీ ఉపయోగం లేకపోయింది. తేజకి పిల్లలు, జంతువులు, ప్రకృతి, మొక్కలు, పక్షులు వంటివి ఎంతో ఇష్టం. ఇక ఆయన భార్య శ్రీవల్లి ఆర్గానిక్‌ఫుడ్స్ పండిస్తు ఉంటుంది. పాండిచేరి అరవింద్ మహర్షి భక్తురాలు ఆమే. పెద్దకుమారుడు అమితవ్ తేజ్ అమెరికాలో ఉంటూ, తన సంపాదనతోనే తన చదువు చదువుతున్నాడు. ఇక కుమార్తె ఐల వయసు 16 ఏళ్లు, ఆమె కూడా తేజ లాగానే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమెకు కర్ణాటక సంగీతం, పాశ్చత్య సంగీతం, పియానో, వయెలిన్, గిటార్ వంటివి వాయించడంతో పాటు చిత్రాలు కూడా గీయగల నేర్పరి అని అంటారు.
మరి తేజకి వారసుడు కుమారుడా? లేక కుమార్తెనా? అన్నది తేలాల్సివుంది. మరి దాదాపుగా 10 , 12 ఏళ్ల నుంచి వరుస పరాజయాలలో ఉన్న తేజకి 'నేనే రాజు నేనే మంత్రి' అనుకున్న స్థాయిలో కాకపోయినా, ఆయనకు మరలా అవకాశాలు తెచ్చిపెడుతుందా? ఆయనను మరలా బిజీ చేస్తుందా? అనే విషయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.