కొన్ని చిత్రాల కథలను కొందరు వర్దమాన రచయితల నుంచి మేధో చౌర్యం చేసి వాటిని తమ కథగా ప్రచారం చేసుకునే దౌర్భాగ్యులు ఈ దేశంలో మరీ ముఖ్యంగా సినిమారంగంలో కోకొల్లలు. బోయపాటి శ్రీను తనకు క్రెడిట్ ఇవ్వలేదని డైరెక్టర్‌గా మారిన కొరటాల శివ తన 'శ్రీమంతుడు' స్టోరీ వేరే రచయిత నుంచి చౌర్యం చేశాడని ఫిల్మ్‌చాంబర్‌కి ఫిర్యాదు కూడా అందింది. ఇక ఆయన తాజాగా మహేష్-దానయ్యలతో తీస్తున్న 'భరత్ అనే నేను' చిత్రం కథను కూడా వేరే వ్యక్తి కథేనని తెలుస్తోంది. కాగా ఈ కథ రచయిత ఆర్ధిక పరిస్థితి బాగా లేనందున ఏదో కొంత మొత్తం ఇచ్చి సర్దిబాటు చేశాడట కొరటాల. అయినా ఎంత డబ్బు ఇచ్చినా కధా రచయితగా తన పేరు వేసుకోవడం, ఆ వ్యక్తి పేరు వేయకపోవడం మేధో చౌర్యం కిందే లెక్క. ఇక 'మగధీర' నుండి పెద్ద వంశీ తీసిన పలు చిత్రాల కథలు కూడా స్వాతి, విపుల, చతుర వంటి వాటి నుంచి కాపీకొట్టి తీసినవే.
ఇక తేజ తాను తీసిన 'నేనే రాజు నేనే మంత్రి' రివ్యూలపై స్పందిస్తూ తాను పదిపదిహేనేళ్ల తర్వాత జరిగే విషయాలను ఇప్పుడు ఆలోచిస్తానని, తన స్టాండర్డ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని, తన చిత్రాలను అర్ధం చేసుకోలేని రివ్యూ రైటర్స్ తన పాయింట్‌ని సరిగా క్యాచ్ చేయలేక తప్పుగా రివ్యూలు రాస్తున్నారని ఎండగట్టాడు. కాగా అసలు 'నేనే రాజు.. నేనేమంత్రి' చిత్రం ఒరిజినల్ కథ తేజది కాదని, తిమ్మారెడ్డి అనే వర్దమాన రచయిత నుంచి చౌర్యం చేశాడనే మాట వినిపిస్తోంది. ఈ విషయం తేజని అడిగితే ఏదో నాన్చుడు ధోరణిలో ఒకసారి అవునని, మరోసారి కాదని, మరోసారి తిమ్మారెడ్డికి ఇవ్వాల్సింది సెటిల్ చేశామని చెబుతున్నాడు.
ఇక ఈ చిత్రాన్ని సురేష్‌బాబు వంటి నిర్మాత ప్రొడ్యూస్ చేయడం, రానా కూడా కాస్త జెంటిల్‌గా ఉండే మనుషులు కావడంతో ఇది నిజం కాదేమోనని, అలా అయితే సురేష్‌బాబు, రానాలు ప్రోత్సహించరు కదా...! అని కొందరు భావించారు. తాజాగా తిమ్మారెడ్డి మాత్రం తేజ తననుంచి ఆ కథను చౌర్యం చేసిన మాట వాస్తవమేనని, టైటిల్స్‌లో కార్డ్, మంచి రెమ్యూనరేషన్ ఇప్పిస్తానని చెప్పి సురేష్‌బాబు - రానాలతో డీల్ సెట్ అయిన తర్వాత మరలా ఆ ప్రస్దావనే తేలేదని అంటున్నాడు. అయినా కథను దొంగిలించవచ్చు కానీ దానిని ఎలా తీయాలి? అనే క్రియేటివిటీనీ తేజ దొంగిలించలేడు కదా...! అని తిమ్మారెడ్డి అంటున్నాడు. మరి దీనిపై తేజ ఎలా ప్రతిస్పందిస్తాడో వేచిచూడాల్సివుంది...?!