'ఇంద్ర' చిత్రంలో చిన్నప్పటి మెగాస్టార్ చిరంజీవిగా తొడకొట్టే సీన్‌లో కేకపెట్టించిన బాలనటుడు తేజ. ఈ చిత్రంలో ఆ బాలనటుడు తొడగొట్టగానే మెరుపులు వచ్చే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత కూడా ఈ బాలనటుడు 'యువరాజు, సాంబ, ఠాగూర్, బాచి, చూడాలనివుంది' వంటి అనేక చిత్రాలలో నటించి బాలనటునిగా 50కి పైగా చిత్రాలు చేశాడు. ఇక ఒకప్పుడు బాలనటులుగా నటించిన హీరోలైన తరుణ్, హరీష్, బాలాదిత్య, తనీష్ వంటి వారు పెద్దగా ఆకట్టుకోలేక కొంతకాలం డ్రీమ్‌బోయ్ ఇమేజ్‌ని సాధించి త్వరగానే వెండితెరపై నుంచి నిష్క్రమించారు.
ఇక తాజాగా ఈ బాలనటుడు తేజ చదువు ముగించి త్వరలో హీరోగా తెరంగేట్రం చేయనున్నాడు. పలు చిత్రాలను నిర్మించిన బెక్కం వేణుగోపాల్ తన స్వంత సంస్థ ద్వారా ఈ బాలనటుడిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాకి 'స్వామిరారా, ఉయ్యాల జంపాల, రౌడీఫెలో' వంటి చిత్రాలకు సంగీతం అందించిన సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. దీని ద్వారా హరి అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నాడు.
చదువు పూర్తయిన తర్వాత ఈ బుల్లిహీరో చేసిన కొన్ని ఫొటో షూట్స్ చూస్తుంటే కుర్రాడు బాగానే ఉన్నాడనిపిస్తోంది. మరి ఈ చిత్రం ద్వారా తేజ ఎలాంటి సక్సెస్‌ని అందుకుంటాడు? మిగిలిన ఎక్కువ శాతం బాలనటులలాగా ఈయన కూడా మూడు నాళ్ల ముచ్చటేనా? లేక స్థిరపడతాడా? అనే విషయాలను వేచిచూడాల్సివుంది. ఇక ఈ చిత్రంలో ప్యాడింగ్ ఆర్టిస్టులుగా పలువురు పేరు ప్రఖ్యాతులున్నవారు నటించనున్నారు.