ఆగస్ట్ 11న రానా 'నేనే రాజు నేనే మంత్రి', నితిన్ 'లై', బోయపాటి శ్రీను 'జయ జానకి నాయక' చిత్రాలు విడుదలయ్యాయి. మంచి కలెక్షన్లు, ఎక్కువ థియేటర్లు, ప్రమోషన్ పరంగా 'నేనే రాజు నేనే మంత్రి'కి మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రం చూసిన వారు రానా దగ్గుబాటి నటనకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఓ మోస్తరుగా మొదలు పెట్టి సినిమా రిలీజ్ సమయానికి బాగా ప్రమోట్ చేసిన నిర్మాత సురేష్‌బాబుకి ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో ఈ చిత్రం సక్సెస్ క్రెడిట్ రానా-సురేష్‌బాబులకు అంటే తండ్రీ కొడుకులకి దక్కుతోంది. సినిమా చూసినవారు మాత్రం కొన్ని సీన్స్ విషయంలో తేజ డైరెక్షన్‌ని బాగా విమర్శిస్తున్నారు.
ఇక ఓ మాస్ చిత్రం హిట్టయితే అది ఖచ్చితంగా 'సరైనోడు, డిజె'లలాగా హీరో క్రెడిట్‌లోకే క్రెడిట్ వెళ్లిపోతుంది. అలా యాక్షన్ చిత్రాల క్రెడిట్ దర్శకుడి క్రెడిట్‌లో పెద్దగా పడదు. కానీ ఓ మోస్తరు హీరోని ఇంకా చెప్పాలంటే కొత్త యాక్షన్ హీరోతో సినిమా చేసినా కూడా మంచి హిట్ కొట్టేసిన 'జయ జానకి నాయక' హిట్ క్రెడిట్ అనూహ్యంగా బోయపాటి శ్రీను ఖాతాలో పడిపోయింది. పెద్దగా పేరు లేని హీరో అయినా తన దర్శకత్వంతో బోయపాటి మ్యాజిక్ చేశాడని అందరూ ఆయన్ను తెగ పొగిడేస్తున్నారు.
ఇక 'లై' చిత్రం సరిగ్గా ఆడకపోవడానికి మంచి కొత్తదనం ఉన్న కథే అయినా కన్‌ఫ్యూజన్లకు తావిచ్చిన దర్శకుడు హనురాఘవపూడిని, సినిమా మూలాలు మర్చిపోయి నేల విడిచి సాము చేసే పాత్రను చేసినందుకు నితిన్‌ని, హీరో, దర్శకుల మార్కెట్‌కి తగ్గట్లుగా ఖర్చు పెట్టని నిర్మాతలైన 14 రీల్స్ అధినేతలు మాత్రం విమర్శలు ఎదుర్కొంటుండటం విశేషం.