ఈ మధ్య బాలయ్య ప్రవర్తన ఏం బాలేదు. ఇది బాలయ్య వ్యతిరేకులు చెబుతున్నమాట. ఎందుకంటే, బాలయ్య ఎవరిపై పడితే వారిపై చెయ్యి చేసుకుంటున్నాడు. ఒక బాధ్యత కలిగిన పదవిలో వుండి, టాలీవుడ్ అనే సినీ ఇండస్ట్రీ లో 'టాప్ హీరో' గా చెలామణీ అవుతున్న బాలయ్య.. ఇలా ప్రవర్తించడం..నిజంగా ఆయన అభిమానులకు కూడా నచ్చడం లేదు. కొందరు అభిమానులు దీన్ని ఖండిస్తే..వాళ్ళు బాలయ్య వ్యతిరేకులు గా చిత్రీకరించ బడుతున్నారు. బాలయ్య వెళుతున్న దారి.. నిజంగా వ్యతిరేకులు, విపక్షాలకు ఓ ఆయుధంగా మారుతుందని మాత్రం బాలయ్య గమనించడం లేదు.
ఇదిలా ఉంటే..బాలయ్య చేస్తున్న ఈ పనిని సమర్ధిస్తున్నాడు డైరెక్టర్ పూరి జగన్నాధ్. పైగా దీనిపై ఓ డైలాగు కూడా పడేశాడు. బాలయ్యతో కొట్టించుకోవడం కూడా అభిమానులకి హ్యపియ్యే అని..దీన్ని కూడా బాలయ్య అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. చాలా బాగా చెప్పాడు. అయితే పూరి కూడా బాలయ్య అభిమానినే అని, 101 ఫీవర్ తనకి పట్టుకుందని ఓ..ఊగిపోతున్నాడు. బాలయ్య చేతిలో దెబ్బ తిన్నాక ఎలా ఎంజాయ్ చెయ్యొచ్చో..అభిమానిగా స్టేజ్ పై పూరి ఓ దెబ్బ తిని చూపిస్తే బాగుండేది. పైసా వసూల్ ప్రమోషన్ అదిరిపోయేది.
లేకపోతే ఏంటి? తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. మన ఉన్నతిని కోరుకునే ప్రతి ఒక్కరు వీరితో సమానం. సినిమా స్టార్స్ అందరూ తమ అభిమానులని, ప్రేక్షకులని ప్రతి ఫంక్షన్ లో మీరే మా దేవుళ్ళు అని చెబుతుంటారు. అలాంటి దేవుళ్ళని కొట్టమని, కొట్టించుకోమని చెబుతున్నట్టు ఉంది పూరి చెప్పేది. తన సినిమా 'పోకిరి' లోని డైలాగు 'కొడితే కొట్టించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి' అని పూరి చెప్పించింది విలన్ తో అని పూరి గుర్తు పెట్టుకోవాలి. దీనిని బట్టి బాలయ్య హీరో అవుతాడో, విలన్ అవుతాడో పూరి సారే చెప్పాలి. తద్వారా బాలయ్య ఫ్యాన్స్ కి ఎటువంటి సందేశం ఇచ్చారో పూరి ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుంది.